కేసీఆర్ వర్సెస్ కేజ్రీవాల్ అంటూ.. మోడీపై నిప్పులు చెరిగిన నెటిజన్లు.
అయితే.. ఈ అరెస్టు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అనేది ఆసక్తిగా మారింది.
అనేక ఊగిస లాటలు.. తర్జన భర్జనల అనంతరం.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కనుసన్నల్లో మెలిగే ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కరు కుంభ కోణం కేసులో విచారణకు సహకరించడం లేదనే కారణంగా ఆయనను ఈడీ అధికారులు కొన్నాళ్లుగా ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇప్పుడు అరెస్టు చేశారు. అయితే.. ఈ అరెస్టు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అనేది ఆసక్తిగా మారింది.
నిజానికి మూడోసారి కూడా విజయం దక్కించుకుని కేంద్రంలో పాగా వేయాలని ప్రదాని మోడీ ప్రయత్నా లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. కేంద్రం అద్భుతంగా పనిచే స్తోందనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఇక, ఎన్నికల షెడ్యూల్‌కు ముందు.. గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గించారు. అదేసమయంలో కలిసి వచ్చే పార్టీలతో చెలిమి చేస్తున్నారు.ఇవన్నీ తమకు మూడో సారి అధికారాన్ని కట్టబెడతాయని మోడీ ఆశలు పెట్టుకున్నారు.
ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి కూటమిలో బలమైన నాయకుడు కనిపించడం లేదుకాబట్టి. కానీ, ఒక్కొక్కసారి ప్రజల మూడ్ ప్రత్యర్థి కూటమిలో బలమైన నాయకుడి కోసమే చూడదు. పాలిత నాయ కుడి నిరంకుశ ధోరణిని కూడా చూస్తుంది. ఇప్పుడు ఇదే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఏం జరిగిందని కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు? అని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వెల్లువ కురిపిస్తున్నారు. అంతేకాదు.. తప్పు చేసిన వారిని అరెస్టు చేయాలంటే.. కేంద్రమంత్రి వర్గంలోనే క్రిమినల్ నేరాలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉన్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
సో.. ఎలా చూసుకున్నా.. కేజ్రీవాల్ అరెస్టు.. ఢిల్లీ, పంజాబ్, హరియాణ, తొలిదశ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, అసోం వంటి కీలకమైన రాష్ట్రాలపై పడుతుందని అంటున్నారు. 2014లో మోడీని చూసి బీజేపీని గెలిపించలేదు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో మోడీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు సాక్షాత్తూ మోడీ పెంచి పోషించుకున్న తన ఇమేజ్‌ను తానే కూకటి వేళ్లతో పెకలించుకునే పరిస్థితి వచ్చిందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి లిక్కర్ అనే ది రాష్ట్రాల సబ్జెక్టు. అయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకున్నాయి. ఇదే విషయాన్ని ఏడాది కిందటే సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడు.. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారని చెప్పి.. న్యాయ స్థానాన్ని నమ్మించారు. అది సిఫారసు మాత్రమే. కానీ.. దాని తర్వాత ఏర్పడింది.. రాజకీయ వ్యూహం. కేజ్రీవాల్, కేసీఆర్ కేంద్రంగా సాగుతున్న రాజకీయ క్రీడలో అంతిమంగా వారికంటే కూడా.. బీజేపీకే నష్టం ఎక్కువగా జరుగుతుందనేది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం.