అంబులెన్స్ కు దారి ఇవ్వలేదు... ఇంటికెళ్లి డబుల్ షాకిచ్చిన పోలీసులు!
ఈ సందర్భంగా కేరళ పోలీసులను, సదరు అంబులెన్స్ డ్రైవర్ సమయస్ఫూర్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. కారు యజమానికి తిక్క కుదిరిందని కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో చట్ట వ్యతిరేకమైన పనులు చేయడాలు, పౌరులుగా కనీస బాధ్యతలు మరిచిపొవడాలను పెద్ద గొప్ప పనులుగా భావిస్తున్నారు చాలా మంది అజ్ఞానులు! తాము చేస్తున్న పనుల వల్ల సమాజానికి ఎంత ఇబ్బంది అనే సృహ వారికి ఏమాత్రం ఉండటం లేదు. ఇలా ఆలోచించే అంబులెన్స్ కు దారి ఇవ్వని ఓ వ్యక్తికి బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
అవును... ఈ సృష్టిలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదనే చెప్పాలి! ఎన్నో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి కాపాడుతుంటాయి అంబులెన్సులు. అందుకే... అంబులెన్స్ సైరన్ వినిపిస్తే వెంటనే వాటికి దారి ఇవ్వాలి! ఇది ఎవరో చెబితేనే చేయాల్సిన పని కాదు, ఎవరూ చూడటం లేదని నిర్లక్ష్యం చేసే విషయం అంతకంటే కాదు.. అంబులెన్సుకు దారి ఇవ్వడం అనేది కనీస బాధ్యత!
అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం వెనుక అంబులెన్స్ సైరన్, హారన్ వస్తున్నా పట్టించుకోకుండా డ్రైవింగ్ చేశాడు. ఎన్ని సార్లు హారన్ కొట్టినా, అంబులెన్స్ సైరన్ వినిపిస్తున్నా పూర్తి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు పోలీసులు. లైసెన్స్ రద్దుతో పాటు రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ కూడా వేశారు.
వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని అంబులెన్స్ లో తరలిస్తున్నారు! ఆ సమయంలో త్రిస్సూరు టౌన్ కి చెందిన ఓ వ్యక్తి షిఫ్ట్ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అంబులెన్స్ సైరన్ వినిపిస్తున్నా.. అతడు పూర్తి నిర్లక్ష్యం వహించాడు. రోడ్డుకు ఎడమ వైపు ఖాళీ స్థలం ఉన్నా కూడా దారి ఇవ్వలేదు!!
దీంతో.. సదరు కారు డ్రైవర్ ప్రవర్తనతో విసిగిపోయిన అంబులెన్స్ డ్రైవర్... తన ఫోన్ తో వీడియో తీయడం ప్రారంభించాడు. చివరికి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఎట్టకేలకు దారి దొరకడంతో.. ఆ కారును ఓవర్ టేక్ చేసి అంబులెన్స్ ను ముందుకు కదిలించాడు. ఈ వీడియోను అంబులెన్స్ డైవర్ సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో.. తెగ వైరల్ అయ్యింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారం కేరళ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగారు. వీడియోలో ఉన్న కారు నెంబర్ ఆధారంగా అతడిని గుర్తించారు. నేరుగా ఇంటికి వెళ్లి.. "అంబులెన్స్ కు దారి ఎందుకు ఇవ్వలేదు?" అని ప్రశ్నించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అతడికి బిగ్ షాక్ ఇచ్చారు.
ఇందులో భాగంగా.. 2.5 లక్షల రూపాయలు జరిమానా విధించడంతో పాటు అతడి డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు! ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కేరళ పోలీసులను, సదరు అంబులెన్స్ డ్రైవర్ సమయస్ఫూర్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. కారు యజమానికి తిక్క కుదిరిందని కామెంట్ చేస్తున్నారు.