కేశినేని నాని సంచలన నిర్ణయం... అదేనా అసలు కారణం!

ఈ సందర్భంగా తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని!

Update: 2024-06-10 13:53 GMT

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా కీలకమైన బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఏపీ రాజకీయాల్లో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం, వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... కేశినేని నాని... ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని!

తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తాను తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన విజయవాడ మాజీ ఎంపీ... జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో... రెండు పర్యాయాలు విజయవాడ ప్రజలకు పార్లమెంటు సభ్యునిగా సేవ చేయడం అపురూపమైన గౌరవం అని అన్నారు.

ఈ సందర్భంగా... విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయని.. వారి తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు అని నాని అన్నారు. ఇక తాను రాజకీయాలకు దూరమవుతున్నప్పటికీ... విజయవాడ పట్ల తనకున్న నిబద్ధత మాత్రం బలంగానే ఉందని.. విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటానని తెలిపారు. ఈ సమయంలోనే తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కొత్త అధ్యాయానికి వెళుతున్నప్పుడు, ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను తనతో తీసుకువెళుతున్నట్లు వెల్లడించిన నాని... విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో... విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా... 2014, 2019 ఎన్నిలకలో టీడీపీ నుంచి పోటీ చేసి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇక, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్నిపై ఓడిపోయిన సంగతి తెల్లిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ స్థాయిలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.



Tags:    

Similar News