లోకేశ్ అత్యంత సన్నిహితుడు కిలారు రాజేశ్ గాయబ్!?
తాజాగా కిలారు రాజేశ్ గాయబ్ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సంచలనంగా మారి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన స్కిల్ స్కాం ఉదంతానికి సంబంధించిన చోటు చేసుకున్న ఒక పరిణామం ఆసక్తికరంగా మారింది. స్కిల్ స్కాం మీద ఫోకస్ చేసిన సీఐడీ.. విచారణలో భాగంగా పలువురిని విచారిస్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు కమ్ మాజీ మంత్రి లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా పేర్కొనే కిలారు రాజేశ్ కనిపించకుండా పోవడం ఇప్పుడు చర్చగా మారింది. లోకేశ్ వెన్నంటే ఉండే కిలారు.. ఇప్పుడు కనిపించటం లేదు. కొద్ది రోజులుగా లోకేశ్ ఢిల్లీలోనే ఉండిపోగా.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే కిలారు రాజేశ్ ఎక్కడ ఉన్నాడన్న విషయం ఇప్పుడు చర్చగా మారింది.
కిలారు రాజేశ్ మాటల్ని లోకేశ్ తూచా తప్పకుండా పాటిస్తారని.. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు మాట కంటే కూడా కిలారు మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. టీడీపీ అనుకూల ఎన్నారైలతో మంతనాలు జరపటంతో పాటు.. నిధుల తరలింపులోనూ కిలారు కీలక భూమిక పోషిస్తారన్న ఆరోపణ ఉంది.
పార్టీలో ఏదైనా పోస్టు కావాలన్నా.. ఏదైనా పని చేయించుకోవాలన్నా చంద్రబాబు దగ్గరకు నేరుగా వెళ్లే కన్నా.. కిలారును ఆశ్రయిస్తే పని త్వరగా పూర్తి అవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు షాడో మంత్రిగా వ్యవహరించిన కిలారు.. అప్పట్లో చెలరేగిపోయారని అంటున్నారు. స్కిల్ స్కాంలో రాజేశ్ పాత్ర కీలకమన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పలు అవినీతి ఆరోపణల్లో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుందని చెబుతున్నారు.
స్కిల్ స్కాం బయటకు వచ్చే నాటికి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోగా.. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ దుబాయ్ కు వెళ్లిపోగా.. తాజాగా కిలారు రాజేశ్ గాయబ్ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.