తానే సీఎం అయితే కలిపేసేవారంట... కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-14 04:34 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుతంలో చేసిన జిల్లాల విభజన కారణంగా పాత జిల్లాలు అస్థిత్వం కోల్పోయాయని.. జిల్లాలు విభజించి జగన్ తప్పుచేశారని.. తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే జిల్లాలను మళ్లీ కలిపేసేవాడిని అని ఆయన తాగా చెప్పుకొచ్చారు.

అవును... 2014లో రాష్ట్ర విభజన సమయంలో చాలా రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా జిల్లాల విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా జగన్ సర్కార్ విభజించిన జిల్లాలను తాను ముఖ్యమంత్రి అయ్యి ఉంటే తిరిగి కలిపేసేవాడినని అన్నారు.

ఇదే సమయంలో... బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ న్యాయ సూత్రాలకు, నీటి సూత్రాలకూ విరుధంగా ఉందని.. నదీ జలాల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ ట్రిబ్యునల్ ను తప్పించాలని ఆయన సుచించారు. ఈ ట్రిబ్యునల్ వల్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా నష్టమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై తాను చంద్రబాబుని రిక్వస్ట్ చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తైతే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే సాగునీటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అన్నారు. ఇదే క్రమంలో... ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరగాలని ఆకాంక్షించారు. వీలైనంత త్వరగా రాజధానిని నిర్మిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషంగా ఉందని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి... ఏపీలో పరిశ్రమలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని అన్నారు. అయితే.. నెలల్లోనే మార్పు సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే... మోడీ సారథ్యంలోనే కేంద్రంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన... శాంతి భద్రతలు దిగజారాయని, రెవిన్యూ శాఖను కూడా అస్తవ్యస్తం చేశారని అన్నారు. అయితే... చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి ఆయన తన రాజకీయ అనుభవంతో ఈ సవాళ్లను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం సాయంతో అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు.

Tags:    

Similar News