అమెరికాలో తెలంగాణ విద్యార్థులపై కత్తిదాడి!
అమెరికాలో తెలంగాణ విద్యార్థులపై అతి దారుణమైన కత్తి దాడి ఘటన కలకలం రేపుతోంది.
అమెరికాలో తెలంగాణ విద్యార్థులపై అతి దారుణమైన కత్తి దాడి ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు తెలంగాణ విద్యార్థులపై ఓ దుండగుడు విచక్షణ రహితంగా కత్తితో పొడవడం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగిస్తోంది. నవంబర్ 17న కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో ఈ ఘటన జరిగింది. తెలంగాణకు చెందిన ఖలీద్ బిన్ మసూద్, సయ్యద్ షాదన్ దాడికి గురయ్యారు. దాడికి పాల్పడిన నిందితుడిని మిగెల్ ఏంజెల్ విలారియల్ గా తేల్చారు.
ఫ్రీమాంట్ హబ్ దగ్గర ఖలీద్, సయ్యద్ సాఫ్ట్ డ్రింక్స్ కొనే సమయంలో మిగెల్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తెలంగాణకు చెందిన ఈ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఈ అనూహ్య ఘటనతో షాక్ లో మునిగిపోయారు. ఖలీద్ కు తీవ్ర గాయాలు కావడంతో సర్జరీలు చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. షాదాన్ కు పెద్దగా గాయాలు కాకపోయినా ఈ ఊహించని ఘటనతో షాక్ లో మునిగిపోయారు.
మరోవైపు ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దాడికి గురైన ఈ ఇద్దరి చికిత్స, కోలుకోవడానికి, జీవించడానికి, ఎడ్యుకేషనల్ ఫీజు తదితర అవసరాల కోసం నిధుల సేకరణకు ఫండ్ రైజింగ్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ దాడి వెనుక కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. నేర చరిత్ర కలిగి ఉన్న మిగెల్ ఎలాంటి ఉద్దేశం లేకుండానే ఇద్దరిపై కత్తితో దాడికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ విద్యార్థులు ఇద్దరు ముస్లిం మతానికి చెందిన వాళ్లు కావడంతో కావాలనే టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్వేషం కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ పోలీసులు అందుకు తగిన ఆధారాలు లేవని, ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారు.