కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు... కండిషన్స్ ఇవే!

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌ కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. తాజాగా అతడికి షరతులతో కూడిన బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది.

Update: 2024-02-08 09:53 GMT

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌ కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. తాజాగా అతడికి షరతులతో కూడిన బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది. ఇందులో భాగంగా... రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని తెలిపింది. ఇదే సమయంలో... ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని స్పష్టం చేసింది. అదేవిధంగా... ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది.

అవును... 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన జానిపల్లి శ్రీనివాస్‌ రావు (32)కు ఐదేళ్ల తర్వాత గురువారం బెయిల్‌ మంజూరైంది. ఈ మేరకు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. కొన్ని షరతులను పెట్టింది.

వాస్తవానికి వైఎస్ జగన్ పై విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో శ్రీను బెయిల్ కోసం దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు. దుర్గా ప్రసాద రావు, కిరణ్మయి మండవలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో గురువారం బెంచ్ తన తీర్పును వెలువరిస్తూ.. శ్రీనుకు బెయిల్ మంజూరు చేసింది

కాగా... 2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ పై.. అక్కడే రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్న శ్రీను కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే! దీంతో అతడిని పోలీసుల వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం... ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ నిందితుడు ఎన్‌.ఐ.ఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

అయితే ఈ బెయిల్ పిటిషన్ ను ఎన్.ఐ.ఏ. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో... ఈ పిటిషన్ పై కొద్దిరోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో... జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వల్ల నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఇదే సమయంలో... హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తాజాగా శ్రీనివాస్‌ కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా శ్రీనివాసరావుకు బెయిల్ రావడం పట్ల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు!


Tags:    

Similar News