ఇదో వాదన:జేబులో ఉన్న కోడి కత్తి జగన్ భుజానికి తగిలిందా?

ఈ సందర్భంగా అతడు చెప్పిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కోడి కత్తితో తన కొడుకు దాడి చేయలేదన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

Update: 2024-01-20 04:28 GMT

దాదాపు ఐదేళ్ల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో నాటి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసి గాయపర్చాడు శ్రీను అనే కుర్రాడు. ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ లో పని చేసే అతను.. జగన్ కు అత్యంత సమీపంగా వెళ్లటమే కాదు.. ఆయనపై అభిమానంతో కత్తితో గాయపర్చినట్లుగా చెప్పుకున్నాడు. ఆ తర్వాత జైలుపాలైన అతను.. ఇప్పటికి జైల్లోనే ఉంటున్నాడు. ఈ కేసు విచారణకు సీఎంగా ఉన్న జగన్.. వెళ్లకపోవటంతో అతను బెయిల్ మీద బయటకు రాలేకపోతున్నట్లుగా ఆరోపణ ఉండటం తెలిసిందే.

ఇటీవల కోడికత్తి శ్రీను వ్యవహారం తెర మీదకు వచ్చింది. అతడి సోదరుడు.. శ్రీనుకు బెయిల్ రాకపోవటంపై దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. కోడి కత్తితో దాడి చేసిన కేసులో ఇన్నేళ్లు జైలు జీవితంలోనే మగ్గిపోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాడు. అతడి వాదనకు మద్దతు ఇచ్చే వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. జైల్లో ములాఖత్ సమయంలో తన కొడుకును కలిసిన సందర్భంగా.. తమతో పంచుకున్న విశేషాలు అంటూ కోడి కత్తి శ్రీను తండ్రి తాతారావు కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అతడు చెప్పిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కోడి కత్తితో తన కొడుకు దాడి చేయలేదన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

'ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ లో పని చేసే శ్రీనివాసరావు అక్కడ జగన్ సమీపంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. శ్రీనును నాటి విపక్ష నేత భద్రతా సిబ్బంది వెనక్కి లాగే క్రమంలో అతడి జేబులో ఉన్న కోడికత్తి జగన్ భుజానికి తగిలింది. దాడి గురించి నేటికీ నిజాలు బయటపెట్టటం లేదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జగన్ ను అభిమానించినవాడినే ఐదేళ్లుగా జైల్లో మగ్గబెట్టటం ఏమిటో తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నారు.

తాము చేసేదేమీ లేదని.. ఈ కారణంగానే తన కొడుకు జైల్లో.. తన బార్య సావిత్రి విజయవాడలో.. పెద్ద కొడుకు సుబ్బరాజు నిరాహార దీక్ష చేస్తున్నాడన్న ఆయన.. "మా వాళ్లంతా ఏమైపోతారోనని ఆందోళనగా ఉంది. ముఖ్యమంత్రిగారు.. దయచేసి నా కొడుక్కి బెయిల్ వచ్చేలా ఎన్ వోసీ ఇవ్వండి" అని కోరారు. జగన్ భద్రతా సిబ్బంది ఎంత అత్యుత్సాహంతో వెనక్కి లాగితే మాత్రం.. జేబులో ఉన్న కోడికత్తి జగన్ భుజానికి గాయం చేస్తుందా? అన్నది ప్రశ్న. కాదంటారా?

Tags:    

Similar News