నేనింతే.. మారనంతే.. మరో వివాదంలో కొలికపూడి
ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్త ఒకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కకున్నారు. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్త ఒకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు. సెల్ఫీ వీడియో చిత్రీకరించి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఖరి ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం కూడా సీరియస్ అయింది. గత నెలలో క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. నియోజకవర్గంలోని ఓ రోడ్డు విషయమై నెలకొన్ని భూ వివాదంలో తలదూర్చిన ఎమ్మెల్యే కొలికపూడి అధిష్ఠానంతో చీవాట్లు తినాల్సివచ్చింది. ఆ సంఘటనలో వైసీపీ సానుభూతిపరులుగా చెప్పే ఓ వ్యక్తిని ఎమ్మెల్యే కొట్టారని, ఆయన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించగా, ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై వివాదం కొనసాగుతుండగానే, తాజాగా టీడీపీ కార్యకర్త డేవిడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు డేవిడ్. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తాను కష్టపడినా, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. డేవిడ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిసిన బంధువులు, స్నేహితులు హుటాహుటిన విజయవాడలో ఓ ప్రైవేటు
ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే డేవిడ్ సెల్ఫీ వీడియో కోసం తెలిసిన ఎమ్మెల్యే అది బయట పెట్టొద్దని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.