బండి మాదిరి మాటలు తగ్గిస్తే బాగుంటుంది కోమటిరెడ్డి!
చివరకు ఏమైంది.. కేసీఆర్ అండ్ కో జైలుకు వెళ్లటం తర్వాత..కనీసం బలమైన నోటీసులు సైతం ఇచ్చింది లేదు
చేయాల్సిన పని చేతల్లో కాకుండా మాటల్లో చూపించే తీరు కొందరు నేతల్లో కనిపిస్తోంది. ఇలాంటి తీరుతో ప్రజల్లో పలుచన అవుతామన్న ఆలోచన లేకపోవటం గమనార్హం. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో దొర్లిన తప్పులకు చర్యలు ఉంటాయని చెప్పిన రేవంత్ సర్కారు.. పలు అంశాల్ని ప్రస్తావిస్తుంది.
అయితే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఇటీవల కాలంలో తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలకు జైలు ఖాయమన్న మాట పదే పదే చెబుతుండటం కనిపిస్తోంది. నిజంగానే తప్పులు చేసి ఉంటే.. అందుకు తగిన ఆధారాలు చూపించి.. కేసులు నమోదు చేసి.. చట్టబద్ధంగా అరెస్టు చేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అందుకు భిన్నంగా మాటకు ముందు.. మాట చివరన బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయని.. వారిని జైలుకు పంపుతామని చెప్పటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరిన వేళలో.. ఇప్పుడు కోమటిరెడ్డి మాదిరే.. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరు తెరిస్తే చాలు.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు కేటీఆర్, హరీశ్ లతో పాటు కవితలకు జైలు ఖాయమన్న మాట అదే పనిగా వినిపించేవారు. ఒకదశలో అయితే.. ఇంకేముంది జైలుకు పంపటమే మిగిలిందన్నట్లుగా ఆయన మాటలు ఉండేవి.
చివరకు ఏమైంది.. కేసీఆర్ అండ్ కో జైలుకు వెళ్లటం తర్వాత..కనీసం బలమైన నోటీసులు సైతం ఇచ్చింది లేదు. చివరకుబండి పదవి పోయిన పరిస్థితి. అప్పటి నుంచి జరగని మాటలకు బండి మాటలుగా ప్రస్తావించటం అలవాటుగా మారింది. నాటి బండి మాదిరే నేడు మంత్రి కోమటిరెడ్డి.. విపక్షానికి అదే పనిగా హెచ్చరికలు జారీ చేయటం సరికాదంటున్నారు.
నిజంగానే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ తప్పులు జరిగి.. వాటిని ఆధారాలతో సహా చర్యలు తీసుకుంటే ఎవరు మాత్రం కాదంటారు? కాకుంటే.. అప్పటివరకు సంయమనంతో వ్యవహరిస్తూ మాటలతో కంటే చేతలతో పని ఎక్కువగా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ సర్కారు అవినీతిపై సిట్టింగ్ జడ్జిని నియమించి.. విచారణ చేపడతామని.. నివేదిక రాగానే చర్యలు తప్పవని చెప్పే బదులు.. సిట్టింగ్ జడ్జిని నియమించే కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయొచ్చుగా?