కోరుట్లలో షాకింగ్ సీన్.. ఇంట్లో అక్క డెడ్ బాడీ.. చెల్లెలు అదృశ్యం

దీప్తి డెడ్ బాడీ సోఫాలో ఉండగా.. కిచెన్ లో రెండు లిక్కర్ బాటిల్స్.. కూల్ డ్రింక్ బాటిల్.. ఫుడ్ పాకెట్లు కనిపించాయి.

Update: 2023-08-30 04:06 GMT

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో షాకింగ్ మర్డర్ ఇప్పుడు సంచలనంగా మారింది. పెళ్లి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కు వెళ్లగా.. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఐటీ ఉద్యోగిని అయిన పెద్ద కుమార్తె మరణించి ఉండటం.. చిన్న కుమార్తె కనిపించకుండా పోవటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అసలేం జరిగిందన్న విషయానికి వస్తే.. పోలీసులు.. స్థానికులు అందిస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే..

కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో శ్రీనివాసరెడ్డి.. మాధవి దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు (దీప్తి, చందన).. ఒక అబ్బాయి (సాయి). పెద్దమ్మాయి దీప్తి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తున్నారు.

ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్నారు. చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. కొడుకు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. హైదరాబాద్ లోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో శ్రీనివాసరెడ్డి.. మాధవిలు హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి పది గంటల వేళలో ఇద్దరు కుమార్తెలతో ఫోన్ లో మాట్లాడారు.

మంగళవారం మధ్యాహ్నం పెద్ద కుమార్తెకు ఫోన్ చేస్తే.. లిఫ్టు చేయకపోవటం.. చిన్న కుమార్తె ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో ఇంటి ముందున్న వారికి ఫోన్ చేసి.. తమ ఇంట్లో వారిని పిలవమని కోరారు. వారొచ్చి చూడగా.. దీప్తి అనుమానాస్పద రీతిలో మరణించి ఉండటాన్ని గమనించి.. ఆ విషయాన్ని వారికి చెప్పారు. విషయం పోలీసులకు తెలీటంతో వారు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. దీప్తి మరణించి ఉండగా.. చిన్న కుమార్తె కనిపించకుండా పోయినట్లుగా గుర్తించారు.

దీప్తి డెడ్ బాడీ సోఫాలో ఉండగా.. కిచెన్ లో రెండు లిక్కర్ బాటిల్స్.. కూల్ డ్రింక్ బాటిల్.. ఫుడ్ పాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం సీసీ కెమేరాల్ని పరిశీలించగా.. ఆమె ఒక యువకుడితో ఉదయం 5.12 గంటల వేళలో నిజామాబాద్ బస్సులు ఆగే చోట ఉన్నట్లుగా గుర్తించారు.

అక్కడ నాలుగు నిమిషాలు ఉన్న వారు.. కాసేపటికి నిజామాబాద్ బస్సులో వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీప్తి ఎలా చనిపోయింది? చెల్లెలు చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.

Tags:    

Similar News