ట్వీట్ల మోతకు బదులు అమెరికా నుంచి వచ్చేయొచ్చుగా కేటీఆర్?

ప్రజల తరఫున పోరాటం చేయటమంటే.. వారి ఆశల్ని.. ఆకాంక్షల్ని గుర్తించి.. వాటికి తగినట్లుగా తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Update: 2024-09-04 04:45 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలోకి ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరన్న ప్రాథమిక అంశాన్నిమాజీ మంత్రి కేటీఆర్ ఎప్పటికి గుర్తిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. తన తండ్రి ప్రభుత్వంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కేటీఆర్.. అప్పట్లో తాను ఎలా వ్యవహరించానన్న విషయాన్ని ఎప్పటికి గుర్తుకు తెచ్చుకుంటారు? ఇవాల్టి రోజున ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ వేలెత్తి చూపించటం.. విమర్శలు చేయటం బాగానే ఉన్నా.. ఇదెంతవరకు సబబు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కారణం.. ఆయన వేలెత్తి చూపించే చాలా అంశాల్లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించామన్న విషయం ఆయనకు గుర్తుకు లేకపోవచ్చు కానీ.. ప్రజలు మర్చిపోలేన్న లాజిక్ ను కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారన్నది అర్థం కానిది.

ప్రజల తరఫున పోరాటం చేయటమంటే.. వారి ఆశల్ని.. ఆకాంక్షల్ని గుర్తించి.. వాటికి తగినట్లుగా తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా.. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న తొందర చూసినప్పుడు చిన్నపిల్లాడు కోరుకున్న చాక్లెట్ దొరక్కపోతే చేసే అల్లరి మాదిరి కేటీఆర్ తీరు ఉందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. ఖమ్మం వరదల విషయానికే వస్తే.. రేవంత్ సర్కారు వేగంగా స్పందించిందనే చెప్పాలి. దీనికి కారణం.. ఇష్యూ తెర మీదకు వచ్చిన రెండో రోజు నుంచి ఖమ్మంలోనే ఉండిపోయిన ముఖ్యమంత్రి మూడు రోజులుగా అక్కడే ఉండటం చూస్తున్నదే. సహాయక చర్యల్ని మరింత వేగంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బాధితుల్ని కలవటం.. వారిని ఓదార్చటంతో పాటు.. కొన్ని అంశాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలను చకచకా తీసుకొని.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి రేవంత్. ఇలాంటి పరిస్థితుల్లో విషయాల్ని గమనిస్తూ.. కాస్తంత మౌనాన్ని ప్రదర్శించటం ద్వారా ప్రజలకు తమను తలుచుకునేలా చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రతి చిన్న విషయానికి.. చితక విషయానికి తగదునమ్మా అన్నట్లు స్పందించటంలో అర్థం లేదని చెప్పాలి. ఖమ్మం వరదల వేళ.. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలతో పాటు.. సద్విమర్శ. అదే సమయంలో బాధ్యత కలగిన ప్రధాన ప్రతిపక్ష్ంగా వ్యవహరించటం.

నిద్ర లేచింది మొదలు రేవంత్ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే కేటీఆర్.. తమ వరకు జరిగే తప్పుల్నిచూసుకోరా? అన్నది ప్రశ్న. ఖమ్మం వరదల వేళ.. బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మీద లేదా? అంతదాకా ఎందుకు?అక్కడెక్కడో అమెరికాలో ఉండి..ట్విట్లు చేసే కన్నా.. వెంటనే తన యాత్రను మధ్యలో ఆపేసి తిరిగి వచ్చేయొచ్చు కదా? ఖమ్మం ప్రజానీకానికి గొంతులా మారి.. ప్రభుత్వం వైఫల్యం చెందిన అంశాల్ని ఎత్తి చూపి..వాటి పరిష్కారాల్ని ప్రస్తావిస్తే బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా.. ప్రతి అంశానికి అవసరానికి మించి స్పందించటం మంచిది కాదన్నది మర్చిపోకూడదు. ట్వీట్లతో అది జరగలేదు.. ఇది జరగలేదన్నట్లుగా చెలరేగిపోతే.. ముఖ్యమంత్రి రేవంత్ అన్నట్లు ట్విట్టర్ టిల్లుగానే మిగులుతారు కానీ ప్రజానేతగా ప్రజల్లో నమోదు కారన్న విషయాన్ని ఎప్పటికి గుర్తిస్తారు?

Tags:    

Similar News