సురేఖ-కేటీఆర్ కేసు: వారి వాంగ్మూలం నమోదు చేశాకే తీర్పు

మెదక్ పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావులపై సోషల్ మీడియాలో వికృతంగా ప్రచారం చేశారు.

Update: 2024-10-14 09:39 GMT

మెదక్ పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావులపై సోషల్ మీడియాలో వికృతంగా ప్రచారం చేశారు. అయితే.. ఆ సోషల్ మీడియాలో ప్రచారం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని సురేఖ అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే.. ఆయనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారంటూనే మరికొన్ని ఆరోపణలు చేశారు.

అయితే.. మంత్రి వ్యాఖ్యలను కేటీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పరువు నష్టం దావా సైతం వేశారు. తన ఈమేజీకి భంగం కలిగించారని తెలిపారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని అందులో పేర్కొన్నారు.

అంతకుముందే సురేఖకు నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గడువు ముగిసిన నేపథ్యంలో ఇక మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తొమ్మిదేళ్లకు పైగా మంత్రిగానూ పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సురేఖ వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల రికార్డును, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు.

కేటీఆర్ వేసిన పరువునష్టం పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించి కోర్టు విచారణ చేపట్టగా.. తీర్పును 18వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు కేటీఆర్‌తోపాటు మరో నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రమణ్ స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారు.

Tags:    

Similar News