ఈ దీపావళికి ఫ్లైట్ టికెట్ ధరలు తగ్గాయా? ఎందుకలా?

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి విమానాల్లో ప్రయాణించే వారి మీద టికెట్ భారం తక్కువగా ఉందన్న విషయం వెలుగు చూసింది.

Update: 2024-10-14 10:30 GMT

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి విమానాల్లో ప్రయాణించే వారి మీద టికెట్ భారం తక్కువగా ఉందన్న విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఇక్సిగో పోర్టల్ సీఈవో వెల్లడించారు. దానికి కారణాల్ని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 - 25 శాతం మేర విమాన టికెట్ ధరల తగ్గింపు ఉన్నట్లుగా పేర్కొన్నారు. సాధారణంగా దీపావళి పండుగ సందర్భంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటమేకాదు.. టికెట్ ధరలు సైతం మండుతూ ఉంటాయి. అందుకు భిన్నంగా ఈసారి చౌకగా టికెట్ ధరలు ఉండటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

ఇంతకూ తక్కువ ధరలకు ఫ్లైట్ టికెట్ ధరలు ఎలా సాధ్యమన్న విషయాన్ని ఇక్సిగో పోర్టల్ ఒక రిపోర్టు విడుదల చేసింది. దీని ప్రకారం దీపావళికి నెల రోజులు ముందుగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి.. గత ఏడాది దీపావళికి 30 రోజులు ముందు బుక్ చేసిన ధరలతో పోల్చి ఈ నివేదికను రూపొందించారు. విమాన ఇంధన ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది 15 శాతం తక్కువగా ఉండటం కూడా ఫ్లైట్ టికెట్ ధరలు తక్కువగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు.

నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరు - కోల్ కతా విమాన టికెట్ ధర గత ఏడాది రూ.10,195 కాగా.. ఈసారి 38 శాతం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఈసారి ఆ టికెట్ ధర రూ.6319 మాత్రమే. ఇక.. చెన్నై - కోల్ కతా టికెట్ ధర గత ఏడాది రూ.8725గా ఉంటే.. ఈసారి 36 శాతం తగ్గి రూ.5604కే పరిమితమైంది. ముంబయి - ఢిల్లీ మార్గంలో టికెట్ ధర రూ.8788 నుంచి 34 శాతం తగ్గి రూ.5762కు పరిమితమైంది. హైదరాబాద్ - ఢిల్లీ, ఢిల్లీ - శ్రీనగర్ మార్గాల్లోనూ టికెట్ ధరలు 32 శాతం తగ్గినట్లుగా రిపోర్టు వెల్లడించింది.

గత ఏడాది విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉండటానికి మరో కారణం.. సర్వీసులు పరిమితంగా ఉండటం కూడా ఒక కారణం. గోఫస్ట్ విమాన సేవలు సస్పెండ్ కావటం.. విమాన సర్వీసులు పెరగకపోవటంతో టికెట్ ధరలు అప్పట్లో పెరిగాయి. ఈ ఏడాది అందుకు భిన్నంగా సర్వీసులు పెరగటం.. విమాన ఇంధనం తగ్గటం లాంటి అంశాలు సానుకూలంగా మారటమే కాదు.. ఫ్లైట్ టికెట్ ధరలు పండుగ వేళ నేలకు దిగటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

Tags:    

Similar News