పక్కా ప్రిపరేషన్... సిద్ధిఖ్ హత్య కేసులో కొత్త కోణం!
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్యతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్యతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ హత్యను క్లైమ్ చేసుకున్న బిష్ణోయ్ గ్యాంగ్ కు సంబంధించి రోజుకో విషయం తెరపైకి వస్తుందని అంటున్నారు! ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కొత్త కోణం తెరపైకి వచ్చింది.
అవును... మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న బాబా సిద్ధీఖ్ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇక కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ సమయంలో పోలీసుల విచారణలో ఉన్న ఇద్దరు నిందుతుల నుంచి కీలక విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా... కాల్పులకు ముందు నిందితులు తమ వెంట తుపాకులతో పాటు పెప్పర్ స్ప్రే కూడా తెచ్చుకున్నారని.. దాన్ని వినియోగించారని పోలీసుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. ఇక ఈ హత్యకు ప్లానింగ్ పాటియాలాలో జరిగిందని.. సుమారు 25 - 30 రోజులు ఈ హత్యకు ప్లానింగ్ చేశారని.. పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగినట్లు విచారణలో వెల్లడైందని అంటున్నారు.
మరోపక్క ఈ కేసులో పట్టుబడిన నిందితులిద్దరినీ అక్టోబర్ 24 వరకూ పోలీసు కస్టడీకి పంపబడ్డారు. వీరి నుంచి పోలీసులు.. రెండు పిస్టల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో.. నిందితుల్లో ఒకరు పెప్పర్ స్ప్రే చల్లుతుండగా.. మిగిలిన ఇద్దరూ కాల్పులు జరిపారని అంటున్నారు. కాల్పులు జరిపినవారిలో ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు ఉన్నాడు!
కాగా... ఈ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటించిన షుబు లోంకర్ సోదరుడు.. ప్రవీణ్ లోంకర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. ఈ హతకేసులోని నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడని చెబుతున్నారు.