కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారో తెలుసా?
అవును... సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ అనంతరం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన కేటీఆర్... తన చదువులు, ర్యాంకుల గురించి తెలిపారు.
తెలంగాణలో తొమ్మిది మెడికల్ కాలేజీలను వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్ రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరాస్తాలో మైకందుకున్న కేటీఆర్... తాను చదువుకునే రోజులు, అమ్మ కోరిన కోరిక, నాన్న చెప్పిన ఆశ, ఆఖరికి తాను చదివిన చదువు మొదలైన అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తనకొచ్చిన ఎంసెట్ ర్యాంక్ ను కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పంచుకున్నారు.
అవును... సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ అనంతరం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన కేటీఆర్... తన చదువులు, ర్యాంకుల గురించి తెలిపారు. ఇందులో భాగంగా... 1993లో తాను కూడా బైపీసీ పూర్తిచేసినట్లు తెలిపారు. అమ్మ తనను డాక్టర్ చేయాలనుకుంటే.. నాన్న మాత్రం తనను ఐపీఎస్ ఆఫీసర్ చెయ్యాలని అనుకున్నారని చెబుతూ... నాటి రోజులను గుర్తుతెచ్చుకున్నారు కేటీఆర్.
ఇదే సమయంలో నాడు తనకు ఎంసెట్ లో 1600 ర్యాంక్ వచ్చిందని చెప్పిన కేటీఆర్... అయినప్పటికీ తనకు మెడికల్ సీటు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని.. తెలంగాణాలో 10,000 మంది వైద్యులు ప్రభుత్వ - ప్రైవేటు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు.
ఇదే క్రమంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టూ పీజీ విద్య సిరిసిల్ల జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్న కేటీఆర్... డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కాలేజీలు తెచ్చుకునే స్థాయికి ఈ రోజు తెలంగాణ చేరుకుందని చెప్పారు.
అదేవిధంగా... తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లున్నారని తెలిల్పిన ఆయన, ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో... గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపిన కేటీఆర్... తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారని అన్నారు.