జగన్ ని ఇరికించేస్తున్న కేటీయార్?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వల్లనే తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది కానీ ఒక రాష్ట్రం ఇద్దామన్న ప్రేమతో అయితే కానే కాదని బీయారెస్ మంత్రి కేటీయార్ కొత్త విషయాన్ని చెప్పారు.

Update: 2023-10-29 14:29 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వల్లనే తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది కానీ ఒక రాష్ట్రం ఇద్దామన్న ప్రేమతో అయితే కానే కాదని బీయారెస్ మంత్రి కేటీయార్ కొత్త విషయాన్ని చెప్పారు. తెలంగాణాను మేము ఇచ్చామని ఒక వైపు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సభలలో ప్రచారం చేసుకుంటూంటే కాంగ్రెస్ కి అంత ప్రేమ ఉంటే పదేళ్ళ పాటు చేసిన ఉద్యమాల సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు.

ఒక ఇంటర్వ్యూలో కేటీయార్ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా ఉన్న నాటి వాతావరణం అన్నీ తనదైన శైలిలో వివరించారు. 2009 ఎన్నికల తరువాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇంతలో వైఎస్సార్ మరణించడంతో కాంగ్రెస్ తో జగన్ విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారని ఆయన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశారు.

ఏపీలో జగన్ పార్టీకి పెద్ద ఎత్తున ఆదరణ దక్కడంతో పాటు కాంగ్రెస్ కి ఏపీలో ఇబ్బందులు తలెత్తడంతో తెలంగాణాలో అయినా రాజకీయాన్ని కాపాడుకుందామన్న ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రకటన చేశారు తప్ప నిజంగా ఇవ్వాలన్న చిత్తశుద్ధితో కానే కాదని అన్నారు. అలా కనుక కాంగ్రెస్ అనుకుంటే ఎన్నికల ప్రయోజనాలు రాజకీయ లాభాలు ఎందుకు చూసుకుంటుందని ఆయన ప్రశ్నించారు.

మొత్తం మీద తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కి కేటీయార్ క్రెడిట్ ఇవ్వడంలేదు. వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడారు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఏర్పడడం వల్లనే ఆ పార్టీ చివరికి ఏమీ చేయలేక తెలంగాణాలో పార్టీని బతికికించుకునే ఎత్తుగడతోనే సెపరేట్ స్టేట్ అన్నదే తప్ప మరేమీ కాదని అంటున్నారు.

సరే తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఆ పార్టీకి అధికారం దక్కుతుందని సర్వేలు ఎక్కువగా వస్తునాయి. ఇక తెలంగాణా తాము ఇచ్చామని కాంగ్రెస్ జనంలోకి వెళ్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి బీయారెస్ మంత్రి ఈ విధంగా చెప్పినా జగన్ వల్లనే తెలంగాణా వచ్చిందని బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇపుడు చర్చనీయాశం అవుతోంది.

జగన్ ఏపీ రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఆయన తెలంగాణాలో వైసీపీని విస్తరించలేదు. దాంతో పాటు ఆయన బీయారెస్ తో మంచిగా ఉంటున్నారని ప్రచారంలో ఉన్న మాట. మరి వాటిని దృష్టిలో పెట్టుకుని చేశారా లేక కాంగ్రెస్ ని డౌన్ చేయాలని చేశారా అన్నది తెలియదు కానీ తెలంగాణా క్రెడిట్ తీసుకొచ్చి జగన్ కి ఇవ్వడం మీద చర్చ అయితే ఉంది.

ఇదిలా ఉంటే తెలంగాణా నుంచి ఏపీ విడిపోవడానికి జగన్ వైఖరి కారణం అని గతంలో పలు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. అయితే ఆయన వ్యతిరేక భావజాలంతో విమర్శలు చేస్తే కేటీయార్ జగన్ ఒక ప్రబల శక్తిగా ఎదుగుతున్నారన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఆయనకు చెక్ పెట్టే క్రమంలో తెలంగాణా ఇస్తూ కొత్త ఎత్తుగడలకు పాల్పడింది అని అంటున్నారు.

ఏది ఏమైనా తెలంగాణా ఎన్నికల రాజకీయాల్లోకి జగన్ని తీసుకుని రావడం మాత్రం కొంత విస్మయం కలిగిస్తోంది. ఇక ఏపీ ప్రజలు పదేళ్లుగా విభజన గాయాలతో ఇబ్బంది పడుతున్న నేపధ్యం ఉంది. చంద్రబాబు వల్లనే తెలంగాణా ఏపీ విడిపోయాయని కొందరు అంటారు. జగన్ రాజకీయ పార్టీని పెట్టి కాంగ్రెస్ ని దెబ్బతీయడం వల్ల అని మరి కొందరు అంటారు. ఎవరు ఏమన్నా కూడా కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది అని మాత్రం ఒప్పుకోవడానికి మాత్రం రాజకీయాలే అడ్డు వస్తున్నాయని అంటున్నారు. మరి సామాన్య ప్రజలలో ఏ భావన ఉంది అన్నది ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News