జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
పారిశ్రామికవేత్తలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని.. జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని.. జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్ లోని మడికొండలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో ఐటీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపారు.
హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివద్ధి చెందుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఇంకా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు. మరో 10 ఏళ్లలో హైదరాబాద్ కు, వరంగల్ కు తేడా తెలియనంతగా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాడ్రెంట్ ఐటీ కంపెనీ నిర్వాహకులతో మాట్లాడుతూ.. 'మీరు ఏపీలో కూడా ఐటీ డెవలప్ కు సహకరించండి.. జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా'నని వ్యాఖ్యానించారు.
ఏపీలోని భీమవరం, ఏలూరు ఎక్కడైనా సరే జగనన్నతో చెప్పి స్థలం ఇచ్చేలా ఏర్పాటు చేస్తానని కేటీఆర్ తెలిపారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుతూ తమ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ కేవలం 160 కిలోమీటర్లు దూరంలోనే ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. విమానంలో కేవలం 40 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చన్నారు. బెంగళూరులో 40శాతం మంది తెలుగు రాష్ట్రాలవారు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని.. వారంతా ఇప్పుడు ఇక్కడకు వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అటువంటివారిని ఇక్కడికి తీసుకొచ్చేలా చేస్తే ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో భవిష్యత్ అంతా ద్వితీయశ్రేణి నగరాలదే అని కేటీఆర్ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా యువతకు ఉపాధి కల్పిస్తోందన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలు, పట్టణాలకు ప్రభుత్వం పరిశ్రమలు తెస్తోందని చెప్పారు. వరంగల్, హనుమకొండలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్.. రూ.900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500మందికి ఉపాధి లభించనుంది.
ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదేనని కేటీఆర్ తెలిపారు. వరంగల్‌లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలని ఆకాంక్షించారు. అక్కడా ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నానన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలని అభిప్రాయపడ్డారు. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలి అని హాట్ కామెంట్స్ చేశారు.