హైదరాబాద్ హాట్ సీట్ కూకట్ పల్లి కింగ్ ఎవరు?
తెలంగాణలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 30న పోలింగ్ అంటూ షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాంగా ఇప్పటికే అధికార బీఆరెస్స్ పార్టీతో పాటు 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్, 52 మంది అభ్యర్థులతో బీజేపీలు తమ తొలి జాబితాను విడుదల చేశాయి.
ఈ సమయంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూకట్ పల్లిని కీలకమైన నియోజకవర్గం అని అంటారు. సెటిలర్స్ అత్యధికంగా ఉండే నియోజకవర్గంగా కూడా కూకట్ పల్లి కీలకం అని అంటారు! 2009 ఎన్నికలకు ముందు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆరెస్స్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈసారి కూడా బీఆరెస్స్ నుంచి ఆయనే పోటీ చేయనుండటంతో... ఆయన ఇప్పటికే పాదయాత్రలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు! అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం కూకట్ పల్లి టికెట్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో... రెండు పార్టీలలోనూ ఆశావహుల మధ్య ఇంటర్నల్ వార్ పీక్స్ కి చేరిందని అంటున్నారు.
ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 ఎన్నికల్లో ఇక్కడ లోక్ సత్తా పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ విజయం సాధించగా, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాదవరం కృష్ణారావు... సమీప బీఆరెస్స్ ఆభ్యర్ధి గొట్టిముక్కల పద్మారావుపై గెలిచారు. అనంతరం కృష్ణారావు బీఆరెస్స్ (టీఆరెస్స్) లో చేరిపోయారు. ఇదే సమయంలో 2018లో తెరాస నుంచి పోటీ చేసిన కృష్ణారావు... టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టాలని కృష్ణారావు ప్రయతిస్తున్న సమయంలో... ఆయనకు సరైన ప్రత్యర్థిని ఎంపికచేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇంటర్నల్ గా అసంతృప్తులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో బీజేపీ నుంచి విజయశాంతి.. కూకట్ పల్లి సీటు ఆశిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో... మేడ్చల్ (అర్బన్) జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ఈసారి కూకట్ పల్లి టికెట్ ఆశిస్తున్నారని అంటున్నారు. ఆయనతో పాటు సుమారు అరడజను మంది టికెట్ ఆశావహులు ఉన్నారని తెలుస్తోంది. దీంతో.. ఆశావహులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా వారి మధ్య పోటీని మరింత పెంచితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయే ప్రమాధం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.