బీజేపీ "కుమార".. ఎన్డీఏలోకి ఆ పార్టీ.. కేసీఆర్ కూ షాక్
ఆ తర్వాత రెండు పార్టీలు కలవకున్నా మళ్లీ ఇప్పుడు జట్టు కట్టాయి. తాజాగా కుమారస్వామి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు.
దక్షిణాదిన తమకు అధికారం దక్కిన ఏకైక రాష్ట్రంలో ఇటీవల పరాభవం ఎదుర్కొన్న బీజేపీ ఎలాగైనా మళ్లీ బలపడాలని చూస్తోంది. ప్రత్యర్థుల బలహీనతలను అడ్డం పెట్టుకుని వారిని దారిలోకి తెచ్చుకుంటోంది. ఇందులోభాగంగా ఎన్నికల ముందు వేసిన ఎత్తుగడ పారింది. అటు ఆ ప్రాంతీయ పార్టీకి కూడా మనుగడ సమస్య ఎదురవడం బీజేపీకి కలిసి వచ్చింది.
గత మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామని గొప్పలు పోతున్న ఆ పార్టీకి కర్ణాటక వాస్తవం ఏమిటో చాటింది. దీంతో బీజేపీకి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పరువు దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలో దొరికింది జేడీఎస్ పార్టీ.
గతంలో అవమానపడినా.. జేడీఎస్ పార్టీ కర్ణాటకలో మూడో పెద్ద పార్టీ. దీని వ్యవస్థాపకుడు మాజీ ప్రధాని దేవెగౌడ. ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీ మద్దతుతో 2006లో అధికారం పంపిణీ పద్ధతిన సీఎం పదవి చేపట్టారు. కానీ, బీజేపీ వంతు వచ్చేసరికి పదవి దిగేందుకు ఒప్పుకోలేదు. ఈ అవమానాన్ని ఆయుధంగా మలుచుకున్న బీజేపీ 2008లో పూర్తి మెజార్టీతో అధికారంలో వచ్చింది.
ఆ తర్వాత రెండు పార్టీలు కలవకున్నా మళ్లీ ఇప్పుడు జట్టు కట్టాయి. తాజాగా కుమారస్వామి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు. వాస్తవానికి ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే కాదు.. జేడీఎస్ ఎన్నడూ లేనంతగా 19 స్థానాలకే పరిమితమైంది. రెండు నెలలుగా బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవిప్పుడు కొలిక్కి వచ్చాయి.
కేసీఆర్ కు షాక్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చిన కేసీఆర్ మొదట కర్ణాటకపైనే ఫోకస్ పెట్టారు. దేవెగౌడ, కుమార స్వామిలను కలిశారు. రెండు పార్టీలు కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లుగానూ కనిపించింది. కానీ, ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్లిన జేడీఎస్ బీఆర్ఎస్ అధినేతకు షాక్ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.