టీడీపీ కూటమికి మూడేళ్ళేనా ?
జమిలి ఎన్నికలు అంటే లోక్ సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు పెడతారు.
ప్రభుత్వం ఎన్నిక అయిన తరువాత అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. కానీ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మూడేళ్ళు మాత్రమే ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. దానికి కారణం జమిలి ఎన్నికలు దేశంలో జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండడమే.
జమిలి ఎన్నికలు అంటే లోక్ సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు పెడతారు. ఇది రెండు దశలుగా నిర్వహిస్తారు అని అంటున్నారు. మొదటి దశలో మొత్తం 28 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు లోక్ సభతో కలిపి నిర్వహిస్తారని రెండవ దశలో మిగిలినవి కూడా కలుపుతారని అంటున్నారు
ఇక దీనిని సంబంధించి చూస్తే కనుక దేశంలో 2026 కీలకమైనది అని అంటున్నారు. ఆ ఏడాది అరడజన్ పైగా రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయని వాటి తరువాత 2027లో మరి కొన్ని అంతకు ముందు ఎన్నికలు 2023, 2024 లో జరిగినవాటిని కూడా కలుపుకుంటే కచ్చితంగా తొలి దశలో 15 కి పైగా రాష్ట్రాలతో పాటు కేంద్రంలో ఎన్నికలు జరగవచ్చు అని అంటున్నారు.
ఇక 2028లో జరగాల్సిన తెలంగాణా 2027 జరగాల్సిన కర్ణాటక, అలాగే కేరళ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే 2027 అంటే ఏపీలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం మాత్రమే పూర్తి అవుతుంది. మరి ఈ మూడేళ్ళ తరువాత మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవడం అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది.
ఒటమి పాలు అయిన దగ్గర నుంచి తమకు ప్రజలలో ఆదరణ ఉందని ఈవీఎంల వల్లనే కూటమి గెలిచింది అని చెబుతూ వస్తున్న వైసీపీ మూడేళ్ళ వ్యవధిలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించగలదా అన్నది కూడా చర్చకు వస్తోంది. అలాగే ఎన్నో హామీలు ఇచి అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మూడేళ్ళ తక్కువ వ్యవధిలో తమ పాలన మీద ప్రజలలో పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుని చెప్పిన వాటిలో చాలా వరకూ చేయగలదా అన్నది మరో చర్చ.
అయితే కేంద్రంలో ఎన్నికలకు బీజేపీ సిద్ధపడుతోంది అంటే ఆ పార్టీ అన్నీ చూసుకునే అడుగులు వేస్తుంది. ఇక బీజేపీతో పొత్తులు ఉంటే ఒకలా లేకపోతే మరోలా ఏపీలోని రాజకీయం ఉండవచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా జమిలి ఎన్నికల ఫీవర్ అయితే ఏపీలో మొదలైంది అని అంటున్నారు.
కూటమి పెద్దలు కూడా దానికి సంసిద్ధులుగానే ఉన్నారని అంటున్నారు. అందుకే వరసబెట్టి ఇచ్చిన హామీలను కూడా వేగంగా నెరవేర్చడానికి టీడీపీ కూటమి ప్రయత్నాలు మొదలెట్టింది అని అంటున్నారు. రానున్న రోజులలో ప్రభుత్వం మరింతగా ఫోకస్ గా జనంలోకి వెళ్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జమిలి ఎన్నికల మీద చర్చ అయితే మొదలైంది అని అంటున్నారు.