ఏంటి నిజామా.. లగడపాటి ఎంట్రీ ఉంటుందా..?

ఏపీలో ఎన్నికల పాలిటిక్స్ మొదలైపోయాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Update: 2023-12-16 06:26 GMT

ఏపీలో ఎన్నికల పాలిటిక్స్ మొదలైపోయాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయమైన సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో అధికార వైసీపీ ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తుంది. మరోవైపు జనసేన - టీడీపీ సీట్ల సర్ధుబాటు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో లగడపాటి రాజగోపాల్ పేరు తెరపైకి వచ్చింది.

అవును... రాబోయే ఎన్నికలు ఏపీలో అత్యంత కీలకమైనవని.. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో... సీట్ల సర్ధుబాటు, అభ్యర్థుల ఎంపిక అనేది ప్రధానంగా ప్రస్తుతానికి పొత్తులో ఉన్న టీడీపీ - జనసేనలకు అత్యంత కీలకమైన విషయమనే చెప్పాలి. ఈ సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కాపాడుకుంటూనే.. మిగిలిన స్థానాల్లోనూ వీజయ బావుటా ఎగరేయాలని టీడీపీ అధిష్టాణం భావిస్తుంది.

ఈ సమయంలో రాష్ట్ర విభజన అనంతరం రెండు సార్లూ గెలుపొందిన విజయవాడ ఎంపీ సీటు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ మొదలైంది. ప్రధానంగా కేశినేని నాని - కేశినేని చిన్ని మద్య సీటు విషయంలో పోరు తప్పదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. పైగా ఆ సీటు జనసేన అడుగుతుందని అంటున్న తరుణంలో... ఇటీవల కేశినేని చిన్ని... పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు! దీంతో చాలామంది కూకట్ పల్లి జనసేన టిక్కెట్ ని గుర్తుచేసుకుంటున్నారు.

సరిగ్గా ఈ కీలక సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీకి సంబంధించిన కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన త్వరలో టీడీపీలో చేరడంతోపాటు.. ఆ పార్టీ తరుపున ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారని కథనాలొస్తున్నాయి. అది కూడా విజయవాడ నుంచే అని తెలుస్తుంది. కారణం... ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ 2014, 2019లో వరుసగా రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజ‌యవాడ ఎంపీగా ప‌నిచేసారు.

ఇక రాష్ట్ర విభ‌జ‌న అనంతరం చెప్పినట్లుగానే రాజ‌కీయాల నుంచి తప్పుకున్నారు. 2014-19 లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో పలు మార్లు భేటీ అయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని చెప్పినా.. ఆ సర్వే బోల్తా కొట్టింది. ఈ సమయంలో మళ్లీ తప్పదనుకున్నారో ఏమో కానీ... ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.

ఈ సమయంలో టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు మాజీ ఎంపీ లగడపాటితో భేటీ అయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అందుకు అంగీకరిస్తే టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్ కన్ ఫాం అని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే... విజయవాడ ఎంపీ టిక్కెట్ విషయంలో టీడీపీ - జనసేన ల మధ్య ఒక క్లారిటీ వచ్చిన అనంతరం ఈ సీటుపై లగడపాటికి ప్రామిస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరోపక్క కేశినేని బ్రదర్స్ ఇద్దరినీ ఒకేసారి కూల్ చేయాలంటే... వారి స్థానంలో లగడపాటికే టిక్కెట్ ఇస్తే మరీ మంచిదని కూడా టీడీపీ పెద్దలు ఈ ఆలోచన చేసి ఉంటారనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ విషయంలో రచ్చ మరీ ఎక్కువయ్యి మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొంటే మాత్రం... లగడపాటికి అటు గుంటూరు కానీ, ఇటు ఏలూరు ఎంపీ టిక్కెట్ గానీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది! ఏది ఏమైనా... ఆంధ్రా ఆక్టోపస్ పొలిటికల్ రీ ఎంట్రీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది!

Tags:    

Similar News