హాట్ టాపిక్... లగడపాటి వర్సెస్ అంబటి @ గుంటూరు!
ఏపీలో ఎన్నికలకు 100రోజుల కంటే తక్కువ సమయం ఉందని కథనాలొస్తున్న సమయంలో రసవత్తర రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి
ఏపీలో ఎన్నికలకు 100రోజుల కంటే తక్కువ సమయం ఉందని కథనాలొస్తున్న సమయంలో రసవత్తర రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. అటు అసెంబ్లీకి, ఇటు లోక్ సభ కు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ-జనసేన పార్టీల కూటమి వివిధ నియోజకవర్గాలకు తగిన అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఒకపక్క అధికార వైసీపీ అభ్యర్థులను మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
మరోపక్క టీడీపీ-జనసేనలు సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటులో బిజీగా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో లగడపాటి రాజగోపాల్ టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆయన విజయవాడ ఎంపీ సీటుపై ఆసక్తికనబరుస్తున్నారని అంటున్నారు. అయితే అక్కడ కేశినేని నాని, చిన్ని మధ్య ఉన్న వార్ దృష్ట్యా ఆ రచ్చలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.
ఈ సమయంలో ఆయనకు గుంటూరు లోక్ సభ స్థానాన్ని ఆఫర్ చేశారని.. ఇందులో భాగంగా లగడపాటి రాజగోపాల్ రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు లో పోటీచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో... ఈసారి గుంటూరు లోక్ సభ స్థానంలో ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది. కారణం... అక్కడ వైసీపీ నుంచి టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుండటమే.
అవును... రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి టీం ఇండియా మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడికి అవకాశం ఉండొచ్చని సమాచారం. ఇదే సమయంలో గుంటూరు నుండి సిట్టింగ్ టీడీపీ లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తన వ్యక్తిగత, వ్యాపార కారణాలతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో ఆర్థికంగా బలవంతుడైన సీనియర్ ని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్న టీడీపీ.. లగడపాటి రాజగోపాల్ ని రంగంలోకి దింపబోతుందని అంటున్నారు. దీంతో ఈ దఫా గుంటూరులో ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకపక్క కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు, మరో పక్క కమ్మ సామాజికవర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ దిగుతుండటంతో పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.
కాగా... విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి లగడపాటి రాజగోపాల్ రెండుసార్లు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జగన్ వ్యాపార భాగస్వామి అయిన ఎన్. శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్స్ గ్రూప్ నుండి బలమైన ఆర్థిక మద్దతును అంబటి రాయుడు కలిగి ఉన్నాడని తెలుస్తుంది. కారణం... ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రాయుడు కీలక ఆటగాడిగా ఉండటమే!