పెద్దలకు పదవులు అచ్చిరావడం లేదా? విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆసక్తికర చర్చ
తాజాగా విజయసాయిరెడ్డి ఎపిసోడుతో ఈ ఇష్యూ మరోసారి హాట్ డిబేట్ గా మారింది.
రాజ్యసభ సభ్యత్వం అంటే ఓ గౌరవం. పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా నేతలకు దక్కే గుర్తింపు. ఏ మాత్రం శ్రమ లేకుండా అధిష్ఠానం ఆశీస్సులతో చాలా మంది రాజ్యసభ సభ్యత్వం పొందుతారు. వారికి ఆ గుర్తింపు, గౌరవం ఇవ్వడం ద్వారా రాజకీయ లబ్ధి జరుగుతుందని ఆయా పార్టీల అధిష్ఠానాలు భావిస్తాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ టీడీపీ, విపక్షం వైసీపీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరావడం లేదనే చర్చ జరుగుతోంది. ఏరికోరి రాజ్యసభకు పంపుతున్న నేతలు ఆ తర్వాత కాలంలో పార్టీని వీడటం పరిపాటిగా మారింది. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో మరోసారి ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
వైసీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఏపీలో ప్రాంతీయ పార్టీలను పెద్దలు చిన్నచూపు చూస్తున్నారని మరోసారి తేలిపోయింది. సాధారణంగా రాజకీయాల్లో రాజీనామాలు, పక్క పార్టీల్లోకి జంపింగులు ఉంటాయి. అయితే పార్టీతో అసమ్మతితోనూ, పార్టీ తమను నిర్లక్ష్యం చేస్తుందనో, అవకశాలు దక్కడం లేదనో నేతలు ఈ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎక్కువగా పదవుల్లో లేని వారు అవకాశాలు వెతుక్కుంటూ పక్కపార్టీల్లోకి దూకుతుంటారు. కానీ, పార్టీలో పెద్ద తలకాయలనే ఉద్దేశంతో ఏరికోరి పెద్దల సభకు ఎంపిక చేసిన నాయకులే ఝలక్ ఇస్తుండటం ఆసక్తి రేపుతోంది. పార్టీలో కొన్ని వందల మంది నేతలు ఉండగా, అసెంబ్లీలో బలం ప్రకారం ఇద్దరినో ముగ్గురినో రాజ్యసభకు పంపుతారు. ఇలాంటి వారు పార్టీపై విధేయత చూపకుండా అధికారం కోల్పోయిన వెంటనే రాం రాం చెప్పేయడమే ఇంట్రెస్టింగ్ అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీకి ఈ పరిస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో టీడీపీ రాజ్యసభా పక్షమే బీజేపీలో వినీనమవగా, ఇప్పుడు వైసీపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభాపక్ష నేత, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయం వెనుక ఏ కారణాలు ఉన్నా ఏపీలో రివాజుగా మారిన రాజకీయాల్లో ఇదో అధ్యాయంగా చెబుతున్నారు. విజయసాయిరెడ్డికన్నా ముందు వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.క్రిష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. వాస్తవానికి వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉండేది. ఎన్నికల అనంతరం ఈ సంఖ్య ఏడుకి చేరింది. ఇక మున్ముందు మరెందరు రాజీనామా బాటలో నడుస్తారో అన్నది ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పుడే కాదు గతంలో కూడా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వారు తర్వాత సొంత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2016లో తొలిసారి తమ నేతను రాజ్యసభకు పంపే అవకాశం దక్కించుకుంది. అలా మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి. గత ఏడాది మార్చిలో రెండోసారి ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజీనామా చేశారు. ఇలా వైసీపీ నుంచి తొలిసారి ఎన్నికైన నేతే రాజీనామా చేయగా, టీడీపీ నుంచి గతంలో ఎన్నికైన వారిలో ఎందరో రాజీనామాలు చేశారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వీరు ఐదేళ్ల క్రితం టీడీపీ రాజ్యసభ పక్షాన్నే బీజేపీలో విలీనం చేశారు.
ఇక అంతకుముందు రాజకీయాలను పరిశీలిస్తే టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు కేంద్ర మాజీ మంత్రులు ఉపేంద్ర, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రేణుకా చౌదరి సీనియర్ నేతలు కిమిడి కళావెంకటరావు, మోహనబాబు, వంగా గీత, తులసిరెడ్డి, మైసూరారెడ్డి, సి.రామచంద్రయ్య వంటివారు కూడా పదవులు అనుభవించి ఆ తర్వాత పార్టీని వదిలేశారు. కళా వెంకటరావు, రామచంద్రయ్య తిరిగి టీడీపీలో చేరినా మిగిలిన నేతలు టీడీపీని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారు.
ఇలా పెద్దల సభకు వెళుతున్నవారంతా పార్టీ విధేయత చాటుకోవడంలో విఫలమవుతున్నారని విశ్లేషణలు ఉన్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి ఎపిసోడుతో ఈ ఇష్యూ మరోసారి హాట్ డిబేట్ గా మారింది.