కమలా జాబ్స్.. కుంభమేళాలో పవిత్ర స్నానం చేయగలరా?

అసలే పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. ఈసారి మాత్రం 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా.. ప్రయాగరాజ్ లో సోమవారం ప్రారంభమైంది.

Update: 2025-01-13 22:30 GMT

అసలే పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. ఈసారి మాత్రం 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా.. ప్రయాగరాజ్ లో సోమవారం ప్రారంభమైంది. వచ్చే నెల 26 వరకు జరగనుంది. అప్పటికి 40 కోట్లమందిపైగా పాల్గొంటారని అంచనా. సోమవారమే 1.65 కోట్ల మంది త్రివేణి సొంగమంలో పుణ్యస్నానాలు చేశారు.

మహా కుంభమేళాకు యూపీ సర్కారు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దీనిద్వారా రూ.2 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది. 40 కోట్ల మంది రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తారని లెక్కగట్టింది.

ఇక మహా కుంభమేళా అన్ని విధాలా సక్రమంగా సాగేలా యూపీలోని యోగి ప్రభుత్వం చూస్తోంది. ఈ మేళాలో ఆసక్తికర విషయం ఏమంటే.. ప్రపంచ ప్రసిద్ధ యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ పాల్గొంటుండడం. వేలాది మంది విదేశీయులు వస్తున్నప్పటికీ, లారీన్ రావడమే కీలకంగా ఎందుకు మారిందంటే..?

లారీన్ మహా కుంభమేళా కోసం తన పేరు మార్చుకున్నారు. ఆమె ఇప్పుడు 'కమల'. నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌.. లారీన్ పావెల్ జాబ్స్‌ కు ఈ పేరు పెట్టారు. అయితే ఆమె అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీనికి కారణం కొత్త వాతావరణం అని చెబుతున్నారు. లారీన్ కొంత కాలం కిందటే భారత్ కు వచ్చారు. ప్రయాగా రాజ్ లో పలు పూజా కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుడిని సైతం దర్శించుకున్నారు. లారీన్ భారత్‌ లో పర్యటించడం ఇది రెండోసారి. ధ్యానం చేసేందుకు ఆమె ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారు. కానీ, ప్రయాగరాజ్ లో అస్వస్థతకు గురవడంతో నిరంజనీ అఖాడాకు చెందిన శిబిరంలో చికిత్స పొందుతున్నారు.

కుంభమేళా సోమవారమే మొదలైనా.. లారీన్ ఇంకా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించలేదు. ఇప్పుడు వాతావరణం కారణంగా అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News