పార్టీ మీద ప్రేమా...టికెట్ మీద ప్రేమా...!?
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలలోనూ ఆ హీట్ కనిపిస్తోంది. అధికార వైసీపీ టికెట్ల విషయంలో చేస్తున్న కసరత్తుతో ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు.
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలలోనూ ఆ హీట్ కనిపిస్తోంది. అధికార వైసీపీ టికెట్ల విషయంలో చేస్తున్న కసరత్తుతో ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై కొట్టారు.
ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్ధసారధి రక్షణనిధి కూడా బయటకు రానున్నారు. వీరితో పాటు మరి కొందరు కూడా వైసీపీని వీడుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. వీరిలో కొందరు జనసేనలోకి కొందరు టీడీపీలోకి చేరుతున్నారు. ఇక ఎంపీలు కూడా ఇద్దరు వైసీపీని వీడారు.
కర్నూల్ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీని వీడితే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా తన దోవ చూసుకుంటున్నారు. ఆయన జనసేనలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీగా ఉన్న విశాఖ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరిపోయారు.
అలా జనసేనకు వలస నేతల తాకిడి పెరుగుతోంది. ఎన్నికల వేళ ఇది ఆ పార్టీకి ఒకింత ఆందంగానే ఉంది. కానీ ఇలా వచ్చిన వారు పార్టీ పట్ల ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేమతో వస్తున్నారా లేక టికెట్ల హామీతో వచ్చి చేరుతునారా అన్నదే చర్చకు వస్తోంది. నిజంగా ప్రేమ ఉంటే వారు ఇపుడే ఎందుకు వైసీపీని వీడుతున్నారు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది
ఇక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొప్పన భవకుమార్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాట ఏంటి అంటే తనకు మూడు రాజధానులు అన్న ప్రతిపాదన నచ్చలేదని, అమరావతి రాజధానిని అలా నిర్లక్ష్యం చేయడంతో తాను మనస్తాపానికి గురి అయ్యాను అని. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలలోనే మూడు రాజధానుల ప్రతిపాధన చేసింది.
మరి నాడే పార్టీని వీడాలి కదా అన్నది వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్న. ఆయనే కాదు టీడీపీ ఎంపీ కేశినేని నాని విషయమూ అలాగే ఉంది. ఆయన టీడీపీ కండువాను పక్కన పెట్టి వైసీపీలో చేరారు వెంటనే విజయవాడ ఎంపీ అభ్యర్ధి అయిపోయారు
టీడీపీలో చూస్తే ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు చేరారు. ఇంకా చాలా మంది చేరబోతున్నారు. ఇలా వచ్చిన వారు అంతా ఎన్నికల వేళకే వస్తున్నారు అని అంటున్నారు. మరి వారికి టికెట్లు ఇస్తూ ఉంటే పార్టీలో ఉన్న వారి సంగతేంటి అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.
అదే విధంగా వచ్చిన వారు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులం అయి వస్తున్నామని ఎలాగూ చెబుతారు. కానీ అప్పటిదాకా ఎందుకు ఆగారో వారికీ జనాలకూ తెలుసు. వారిని సాదరంగా ఆహ్వానించి చేర్చుకుంటున్న పార్టీ పెద్దలకూ తెలుసు.
చిత్రమేంటి అంటే ఇలా చేరిన వారిలో గెలుస్తున్న వారూ ఉన్నారు. ఓడుతున్న వారూ ఉన్నారు. సో అందువల్ల ఈ ట్రెండ్ 2024తోనే ఆగదు, ఇంకా కొనసాగుతుంది అన్న నమ్మకం అయితే ఉంది. సో నేతల పార్టీ మార్పులు తప్పూ కాదు, అది ఇప్పట్లో వదిలేట్టూ కూడా లేదు అన్నదే పరమ సత్యంగా చూడాల్సి ఉంది.