ఏపీలో టిక్కెట్ లేకపోతే నేతలు చేసే నెక్ట్స్ పని ఇదే..!
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగులకు తోడు.. మరింత మంది కొత్త నాయకులు కూడా ఎన్నికల్లోపోటీ చేయాలని భావిస్తున్నా రు. ఈ నేపథ్యంలో వారికి ఆయా పార్టీల్లో టికెట్లు దక్కడం బ్రహ్మపదార్థంగా మారింది. దీంతో ఒంటరిగా అయినా.. బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. కొందరు వైసీపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వీరికి ఆయా పార్టీల్లో టికెట్ దక్కే పరిస్థితి లేకుండా పోయింది.
దీంతో ఇలాంటివారు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు కనిపిస్తున్నారు. ఈయన పిఠాపురం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఈయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన పార్టీ మారాలని ప్రయత్నించినా.. ఫలించలేదు. దీంతో బల నిరూపణ కూడా చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగా బరిలోకి దిగినా.. ఇబ్బందులు ఉండవని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఇక, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌కు కూడా.. వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. తాజాగా ఆయన మేధావులతో కలిసి.. ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటు కాకుండా.. అసెంబ్లీకి ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం కూడా.. అసంతృప్తితోనే ఉన్నారు.
ఆయనను అసెంబ్లీ నుంచి తప్పించిన జగన్.. పార్లమెంటు టికెట్ కన్ఫర్మ్ చేశారు. కర్నూలు పార్లమెంటు స్థానం ఇచ్చారు. అయితే.. ఇది ఆయనకు నచ్చలేదు. దీంతో తన వర్గంతో ఆయన భేటీ అయ్యారు. ఏం చేయమంటారు? అని అడిగారు. పార్టీ అధిష్టానానికి అసెంబ్లీ టికెట్ ఇవ్వమని ప్రాధేయపడ్డానని.. అయినా.. తన మాట వినిపించుకోలేదని అన్నారు. మీ ఆశీర్వాదం ఉంటే.. ఏదో ఒక రకంగా.. అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. అంటే.. ఆయన కూడా.. ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.
ఇక, ఈ వ్యవహారం కేవలం వైసీపీతోనే పోలేదు. టీడీపీలోనూ కొందరు నాయకులు టికెట్ ఇవ్వకపోతే.. ఒంటరి పోరు చేస్తామని చెబుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డికి టీడీపీ టికెట్ దక్కేలా లేదు. ఈ సీటును జనసేనకు కేటాయించనున్నారు. దీంతో భూమా తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. పైగా భూమా కుటుంబంలో రాజకీయ వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఈయన కూడా ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.