క్రికెట్ చూపిస్త మామా.. తెలంగాణ ప్రచారంలో కొత్త ట్రెండ్!
కాదేదీ.. అన్నట్టుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా.. ప్రచారాస్త్రంగా మారిపోయింది.
కాదేదీ.. అన్నట్టుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా.. ప్రచారాస్త్రంగా మారిపోయింది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు కుస్తీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు.. ఈ విషయంలో పోటీ పడుతున్నారు. మన నాయకుడు.. 100 అడుగుల స్క్రీన్ పెడు తున్నాడు.. వచ్చేయండి! అంటూ.. సోషల్ మీడియాలో దుమ్మురేపే ప్రచారం జరుగుతోంది.
ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ప్రియులకు ఇది ఒకరకంగా పండుగే. దీంతో ముందుగానే ఈ ఫీవర్‌ను ఊహించిన వ్యాపార వేత్తలు, చిరు వ్యాపారులు కూడా.. ఆదివారం నాటి వ్యాపారాలకు సెలవు ప్రకటించారు. ఇక, రాజకీయ నేతలు కూడా యువ నాడిని పట్టుకున్నారు. వారికి క్రికెట్ చూపించి.. ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ పరంపరలో బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేలా.. యువతను ఆకర్షిస్తున్నారు. దీనికిగాను పెద్ద పెద్ద తెరలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు 100 అడుగుల తెర ఏర్పాటు చేస్తుంటే.. మరికొందరు 500 అడుగుల తెర అంటూ.. ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే.. బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటుకు పోలీసుల అనుమతి కావాలి.
కానీ, ఇప్పుడుఎన్నికల సీజన్ కావడంతో పోలీసులు ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైస్థాయిలో ఒత్తిళ్లు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది తమ పరిధిలో లేదని.. ఎన్నికల సంఘం ఒప్పుకొంటే తాము అనుమతి ఇస్తామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు.. స్థానిక పోలీసులు తేల్చి చెప్పారు. ఇక, ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే ఇంటి ముందే.. స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, పోలీసులు అడ్డుకున్నారు.