జమిలి ఎన్నికలు...లోకేష్ కి ప్లస్ అవుతాయా ?

బీజేపీకి జమిలి ఎన్నికల మీద ఫోకస్ ఎందుకు అంటే విస్తారమైన రాజకీయ ప్రయోజనాలు కోసమే అన్నది వాస్తవం అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు.

Update: 2024-10-13 01:30 GMT

దేశంలో జమిలి ఎన్నికల మీద ప్రస్తుతం వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు మూడేళ్ళ లోపు వస్తాయని అంటున్నారు. బీజేపీకి జమిలి ఎన్నికల మీద ఫోకస్ ఎందుకు అంటే విస్తారమైన రాజకీయ ప్రయోజనాలు కోసమే అన్నది వాస్తవం అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు.

ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది భిన్నత్వంతో కూడిన భారత దేశంలో అసలు జరిగేది కాదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోవడం అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న ఎస్పీ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీజేపీని బాగా తగ్గించడంతో కమలం పార్టీలో అలజడి మొదలైంది.

గుండెకాయ లాంటి యూపీని దక్కించుకోకపోతే కేంద్రంలో బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని అంచనాతోనే 2029 దాకా కాకుండా 2027లోనే జమిలి పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

బీజేపీ ఆలోచనలు ఇలా ఉంటే ఏపీలోని ప్రాంతీయ పార్టీలు కూడా దానికి అనుగుణంగా తమ ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ జనసేన జమిలి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే అని అంటున్నారు. వైసీపీ అయితే ప్రతిపక్షంలో ఉంది. ఎపుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీకి మంచిదే అని అంటున్నారు.

ఇక టీడీపీలో భావి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్ కి ఈ ఎన్నికలు ఎంతవరకూ ప్లస్ అవుతాయన్న చర్చకి తెర లేస్తోంది. నారా లోకేష్ ని చంద్రబాబు తన వారసుడిగా ఇప్పటికే ముందు పెట్టారు. ఆయనకు పార్టీలో ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర అప్పగించారు.

ఈ అయిదేళ్ళ పాటు ఆయనను తనతో ఉంచుకుని 2029లో మరోసారి పార్టీ గెలిస్తే అపుడు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని బాబు చూస్తున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే అయిదేళ్ళు కాదు మూడేళ్ళే కూటమి పాలన అని ఎన్నికలు 2027లోనే వస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ కి అవి ఎంతవరకూ ఉపకరిస్తాయన్నాదే అంతా ఆలోచిస్తున్నారు.

జమిలి ఎన్నికలు అంటే ఏపీలో కూటమి అంతా ఒక్కటిగానే నిలిచి పోటీ చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఎన్డీయేకు 2024 ఎన్నికల్లోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కలేదు. దాంతో ఈసారి ఏమి అవుతుందో అన్న బెంగ ఎటూ ఉంటుంది దానికి తోడు మూడవసారి పవర్ లోకి వచ్చాక మరి మూడేళ్ళకు ఎన్నికలు అంటే ఇంకా యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతుందని అంటున్నారు.

ఇక ఏపీలో టీడీపీ జనసేనలను మిత్రులుగా చేసుకునే బీజేపీ ఎన్నికలకు వెళ్తుంది అని అంటున్నారు. అదే జరిగితే మోడీ గ్రాఫ్ బాగుంటే కచ్చితంగా మరోసారి ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. కూటమి మళ్ళీ పవర్ చేజిక్కుంచుకుంటే కనుక అది నారా లోకేష్ కే ప్లస్ అని అంటున్నారు. ఆయన 2029 దాకా కూడా వేచి చూడకుండా ముందుగా సీఎం అవడానికి ఈ జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని అంటున్నారు.

ఇప్పటికే లోకేష్ చంద్రబాబు తరువాత అనంట్లుగా ఫోకస్ అవుతున్నారు. కీలక విషయాలను ఆయన మీడియా ముందు పంచుకుంటున్నారు. దాంతో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్న వారు ఇపుడు సీఎం గానే ఆయనను చూడాలని అనుకుంటున్నారు. అది నెరవేరేందుకు జమిలి ఎన్నికలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని వారు అంచనా వేసుకుంటున్నారు.

Tags:    

Similar News