చంద్రబాబు అరెస్ట్ పై లోకేష్ ఆగ్రహం
ఇలా తనను అడ్డుకునేందుకు సిగ్గు లేదా, తన తండ్రిని అరెస్ట్ చేస్తే రెస్ట్ తీసుకోవాలని చెప్పడం ఏమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఆయన తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. తన తండ్రిని కలిసేందుకు వెళతానన్న లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడంతో లోకేష్ క్యాంప్ సైట్ దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. లోకేష్ బయటకు వెళితే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని లోకేష్ తో పాటు కొందరు టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడు లండన్ కు వెళ్ళాడని, మంచోడు జైలుకు వెళ్లాడని, ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అని లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితిలో పోలీసులున్నారని, ఎఫ్ఐఆర్లో పేరు లేని చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పిచ్చోడి కళ్ళల్లో సంతోషం కోసమే చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వేయడం జగన్ కు సాధ్యం కాదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తండ్రిని తాను చూసేందుకు ఎవరి అనుమతి కావాలంటూ పోలీసులను ప్రశ్నించారు. తనను అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా క్యాంపు సైట్ దగ్గరే నేలపై కూర్చొని లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు లోకేష్ పలు ప్రశ్నలు సంధించారు.
మీ తండ్రిని అరెస్ట్ చేస్తే వెళ్లకుండా ఉంటారా అని లోకేష్ ప్రశ్నించారు. ఇలా తనను అడ్డుకునేందుకు సిగ్గు లేదా, తన తండ్రిని అరెస్ట్ చేస్తే రెస్ట్ తీసుకోవాలని చెప్పడం ఏమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని ఫైర్ అయ్యారు. తనను అడ్డుకోమన్న పోలీసు అధికారి పేరు చెప్పాలని నిలదీశారు. సైకో జగన్ చెప్పాడని తనను అడ్డుకున్నారా అని నిలదీశారు. ఏం గొడవలు జరుగుతున్నాయని తనను అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.