ఏపీలో ఘోర ప్రమాదం: ప్రైవేటు బస్సును ఢీ కొన్న లారీ.. ఆరుగురు మృతి

ఈ ప్రమాదంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘోర ప్రమాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు

Update: 2024-02-10 05:46 GMT

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పదిహేను మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని టోల్ ప్లాజా వద్ద రెండు లారీలు.. ఒక బస్సు ఢీ కొన్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘోర ప్రమాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత (సుమారు 2 గంటల సమయంలో) కావటి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో తొలుత ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా ప్రైవేటు బస్సు వస్తుండటంతో నియంత్రణ కోల్పోయిన లారీ.. బస్సును బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్నంతనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న వారు.. సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేటు బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న వేళలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రైవేటు బస్సును కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీకి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టే ఉదంతంలో మితిమీరిన వేగమా? నిద్ర మత్తా అన్నది తేలాల్సి ఉంది. మరణించిన వారి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే విషయంలో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News