మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో తొలి అరెస్టు
రాష్ట్రంలో సంచలనం సృష్టించడం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో తొలి అరెస్టు జరిగింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించడం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో తొలి అరెస్టు జరిగింది. ఈ సంఘటనలో కీలకపాత్ర పోషించిన సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు తర్వాత అంటే జులై 21న అర్ధరాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కార్యాలయం మొత్తం మంటల్లో మసైపోయింది. ఈ సబ్ కలెక్టరేట్ పరిధిలోని పలు భూ కుంభకోణాలు చోటుకేసుకున్నాయని, వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన ప్రధాన నాయకుడు తన అనుచరుల పేరిట వందల ఎకరాల భూములను రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కలెక్టరేట్లో మంటలు పుట్టడం రాష్టంలో సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ సంఘటన ఎలా జరిగిందో విచారించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు హుటాహుటిన మదనపల్లె చేరుకుని, ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని తేల్చారు. ఎవరో కావాలనే కార్యాలయానికి నిప్పుపెట్టినట్లు అనుమానించిన డీజీపీ.. కేసు విచారణను సీఐడీకి అప్పగించారు.
ఈ కేసు విచారాణాధికారిగా సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ను నియమించారు. మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టరేట్ దహనంపై రెవెన్యూ శాఖ కూడా అంతర్గతంగా విచారణ చేపట్టింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు భూ దందాలకు పాల్పడినట్లు బాధితులు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇటు రెవెన్యూ, అటు సీఐడీ ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకుని విచారణ చేపట్టాయి. కేసుతో సంబంధం ఉందని పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. ఆ రోజు కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతడే ఈ కేసులో మొదటి ముద్దాయని సీఐడీ డీఎస్పీ తెలిపారు. నిందితుడిని చిత్తూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కేసులో మరింత మందిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.