ఇంటివాడయిన చదరంగం చాంపియన్!
కార్ల్ సన్ ఈ వారంలో తన ప్రియురాలు ఎల్లా విక్టోరియా మలోన్ ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు అతడి సొంత దేశం నార్వేకు చెందిన మీడియా పేర్కొంది.
ఇటీవలి కాలంలో చదరంగం (చెస్) బాగా వార్తల్లో నిలిచిన క్రీడ. ఓవైపు భారత క్రికెట్ జట్టు వరుసగా న్యూజిలాండ్ (స్వదేశంలో), ఆస్ట్రేలియా పర్యటనల్లో దారుణ ఫలితాలు ఎదుర్కొనగా.. చదరంగంలో మాత్రం అద్భుత ఫలితాలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గుకేశ్ ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. తెలుగు తేజం కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ గా నిలిచింది. దీంతో భారత క్రీడా రంగం పరువు కాస్త నిలిచింది. ఇక గుకేశ్ విజయం, హంపి కమ్ బ్యాక్ తో పాటు ప్రపంచ చదరంగంలో మరో సంఘటన కూడా జరిగింది. అయితే, అతడు మన దేశం వాడు కాదు.
జీన్స్ వద్దన్నారని టోర్నీ బహిష్కరణ..
మాగ్నస్ కార్ల్ సన్.. ప్రపంచ నంబర్ వన్ చెస్ ఆటగాడు. ఈ మేధో క్రీడలో అనతొలి కార్పొవ్, గ్యారీ కాస్పరోవ్ తర్వాత ఆ స్థాయి పేరు తెచ్చుకున్నాడు. నార్వేకు చెందిన కార్ల్ సన్ ను ఓడించడం అంత సులభం కాదనేది ప్రస్తుత చెస్ ప్రపంచంలోని మాట. కాగా, ఇటీవల కార్ల్ సన్ జీన్స్ ధరించి పాల్గొనవద్దన్నందుకు చెస్ టోర్నీనే బహిష్కరించాడు.
మళ్లీ కొట్టాడు..
ఇటీవలి వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ షిప్ లో కార్ల్ సన్ రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచితో ఓపెన్ విభాగంలో పోటీపడగా మూడు సార్లు గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో టైటిల్ ను ఇద్దరూ పంచుకున్నారు. అయితే, కార్ల్ సన్ బ్లిట్జ్ టైటిల్ ను ఎనిమిదోసారి గెలిచాడు.
ఇంటివాడయ్యాడోచ్...
కార్ల్ సన్ ఈ వారంలో తన ప్రియురాలు ఎల్లా విక్టోరియా మలోన్ ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు అతడి సొంత దేశం నార్వేకు చెందిన మీడియా పేర్కొంది. వీరి వివాహం రహస్య ప్రాంతంలో జరగనుందని తెలుస్తోంది. కాగా, నిరాడంబరంగా.. కుటుంబసభ్యులు, కొందరు బంధువుల సమక్షంలో కార్ల్ సన్ వివాహం జరిగింది.