రోజుకి 200 కోట్లు... ఏమీటీ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కథ?
ఈ యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్ కు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాం, ఇప్పుడు ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మీడియాలో హాట్ టాపిక్ లు అవ్వగా... తాజాగా మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. పైగా... బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కథనాలొస్తున్న నేపథ్యంలో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది.
అవును... బాలీవుడ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 39 ప్రాంతాల్లో దాడులు చేసి రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకుందని తెలుస్తుంది.
ఈ యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్ కు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించిందని సమాచారం. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్న ఈడీ... ఈ వ్యవహారంలో మరికొంతమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు, మీడియా జనాలు కూడా ఉన్నట్లు గుర్తించిందని అంటున్నారు.
ఛత్తీస్ గఢ్ లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ లు దుబాయ్ లో మకాం వేసి నిర్వహించే ఒక గేమింగ్, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ఇది. ఒకప్పుడు ఈ యాప్ కి పలువురు బాలీవుడ్ ప్రముఖులు భారీగా డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశారని అంటున్నారు. అయితే ఈ యాప్ వ్యవహారం వెలుగులోకి రవడానికి కారణం మాత్రం దుబాయిలో జరిగిన ఒక వివాహ వేడుకే అని తెలుస్తుంది.
ఈ బెట్టింగ్ యాప్ అధినేతల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఇటీవల తన వివాహాన్ని దుబాయ్ లో సుమారు రూ.200 కోట్లతో ఘనంగా చేసుకున్నాడు. దీనికోసం... నాగపూర్ నుంచి కుటుంబ సభ్యులను ప్రైవేటు జెట్లలో తీసుకెళ్లారు. వారితోపాటు టైగర్ ష్రాఫ్, నేహా కక్కర్, భారతి సింగ్, సన్నీ లియోన్, నుశ్రుత్, కృతి కర్బందా... ఇలా అనేక మంది బాలీవుడ్ స్టార్ లను చార్టెడ్ ఫ్లైట్స్ లో పెళ్లికి రప్పించుకున్నారని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ లో జరిగిన ఈ పెళ్లికి రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించిన అంశంపై దర్యాప్తు చేయగా ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం బయటపడిందని తెలుస్తుంది. ఈ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చిన బాలీవుడ్ నటులకు హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలిందని సమాచారం.
బెట్టింగ్ యాప్ వ్యవహారం సాగేదిలా...!:
ముందుగా కొత్త కొత్త వెబ్ సైట్లు, చాటింగ్ యాప్ లతోపాటు సోషల్ మీడియాలోనూ... ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ ప్రచారం చేస్తారు. అనంతరం తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్ లో గ్రూప్ లు ఏర్పాటు చేస్తారు. ఫోన్ కాల్స్ ఉండవు... ఓన్లీ వాట్సప్ కమ్యునికేషన్ అన్నమాట.
అలా చేరిన కస్టమర్లకు బెట్టింగ్ యాప్ లో సభ్యులుగా చేర్చుతున్నట్లు తెలియజేసి... వారికి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో డబ్బులు పెట్టిస్తారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ఈ వ్యవహారంలో ముందుగా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు పెట్టినవారికి లాభాలు వచ్చినట్లు చూపిస్తారు.
దీంతో ఆశపెరిగిన కస్టమర్లు.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించబడతారు. ఫైనల్ గా విడతలవారీగా అదంతా నష్టపోయేలా యాప్ లో రిగ్గింగ్ చేస్తారు. ఈ రకంగా ఈ యాప్ సంపాదన రోజుకి సుమారు రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.