మహారాష్ట్ర ఎన్నికలు: బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ.. ఆ 75 స్థానాలే టార్గెట్
మహారాష్ట్రలో పార్టీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల పర్వం తుదిఘట్టానికి చేరింది.
మహారాష్ట్రలో పార్టీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల పర్వం తుదిఘట్టానికి చేరింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 75 స్థానాలపైనే ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఇంతకీ ఆ స్థానాలేంటి..? వాటినే పార్టీలు ఎందుకు టార్గెట్ చేశాయి..?
మహారాష్ట్రలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇక కోప్రి-పచ్‌పఖాడీ నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండే నామినేషన్ దాఖలు చేశారు. షిండేపై ఉద్ధవ్ వర్గం నుంచి కేదార్ డిఘే పోటీ చేస్తున్నారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నామినేషన్ వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇదే బారామతి నుంచి మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీ పడ్డారు. ఆ పోరులో సుప్రియా సూలే విజయం సాధించారు. ఇప్పుడు అజిత్ పవార్‌కు పోటీగా ఆయన తమ్ముడి కుమారుడు యుగేంద్ర పవార్‌ను బరిలోకి దింపారు. దీంతో బారామతి నియోజకవర్గం నుంచి మరోసారి కుటుంబ పోరుకు సిద్ధమైంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ మహారాష్ట్ర ఎన్నికలని చెప్పొచ్చు. అందుకే.. మహారాష్ట్రలో భారీ విజయం సాధించి.. ప్రజల మద్దతు తమకే ఉందని చాటిచెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయతి అదే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు.. పార్టీల్లో చీలికలతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించేందుుకు కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీల కూటమి మహావికాస్ అఘాడీ ఉవ్విళ్లూరుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని 75 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది.
2019లో ముంబయిలో 12 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ తలపడగా.. ఇందులో ఒకటి మాత్రమే కాంగ్రెస్ గెలచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పనిచేశాయి. ఈసారి అదే శివసేన ఉద్ధవ్ వర్గం కాంగ్రెస్‌తో కలిసి ఉంది. దీంతో ఏ పార్టీకి ఏ మేరకు ఫలితాలు వస్తాయో తెలియకుండా ఉంది. అలాగే.. ఉత్తర మహారాష్ట్రలో గత ఎన్నికల్లో రెండు పార్టీలు 6 సీట్లలో తలపడ్డాయి. కాంగ్రెస్ రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక మరాఠ్వాడాలో ఇరు పార్టీలు 10 సీట్లలో తలపడగా.. కాంగ్రెస్‌కు మూడు స్థానాలు దక్కాయి. పశ్చిమ మహారాష్ట్రలో 7 సీట్లలో తలపడితే కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలిచింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేరుగా 66 స్థానాల్లో పోటీలో పాల్గొంటే.. బీజేపీ 50, కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే.. వీటిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా తలపడుతున్నవి 75 సీట్లలోనే. ఇవి కూడా విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్‌లలోనే అధికంగా ఉన్నాయి. ఒక్క విదర్భలోనే 47 చోట్ల బీజేపీతో కాంగ్రెస్ తలపడుతోంది. ఎంవీఏ కూటమితో పశ్చిమ మహారాష్ట్రలో 32 చోట్ల.. ఉత్తర మహారాష్ట్రలో 17 చోట్ల, మరాఠ్వాడాలో 19 చోట్ల, కొంకణ్‌లో 33 చోట్ల పోటీ పడుతున్నది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ముఖ్యస్థానాలను టార్గెట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి!