రేవంత్ - పవన్ ప్రచారాలకు పోరు మొదలైంది... స్పెషల్స్ ఇవే!
అత్యంత కీలకమైన మరో ఎన్నికకు పోలింగ్ తేదీ వచ్చేసింది.
అత్యంత కీలకమైన మరో ఎన్నికకు పోలింగ్ తేదీ వచ్చేసింది. దేశ ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుంది! ఈ ఎన్నిక ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలకు కారణం అయ్యే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... అత్యంత ఆసక్తికరమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 288 నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికల్లో 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో... అధికార మహాయుతి కూటమి మరోసారి అధికారంపై కన్నేయగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయాలని కంకణం కట్టుకుంది.
ఈ విధంగా... ఎలాగైనా సరే ఈ మహారాష్ట్ర అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూటములు బలంగా ఫిక్సయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలతో కూడిన హై ఓల్టేజ్ ఎన్నికల ప్రచారాలు ఇక్కడ జరిగాయి.
ఇదే సమయంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ కూటమి తరుపున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేయగా... మహా వికాస్ అఘాడీ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, మహారాష్ట్రలో 9.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 6,101 మంది ట్రాన్సెండర్లు, 6.41 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,00,186 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 4 శాతం అధికమని చెబుతున్నారు. ఇక.. సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు.
కూటముల్లో పార్టీల వారీగా పోటీ చేస్తున్న స్థానాల విషయానికొస్తే... "మహాయతి"లో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మిగిలిన శివసేన (షిండే) - 81, ఎన్సీపీ (అజిత్ పవార్) - 59 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
"మహా వికాస్ అఘడి"లో కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. శివసేన (యూబీటీ) - 95, ఎన్సీపీ (శరద్ పవార్) - 86 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ 237 స్థానాల్లోనూ.. ఏఐఎంఐఎం 17 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా.. స్వతంత్రులు 2,086 మంది ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్నారు.