ఆ కుర్చీని మాత్రం వదిలేది లేదట !
అందుకే తాను కూర్చున్న కుర్చీని వదలడం లేదట నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.
మూడు దశాబ్దాల రాజకీయ జీవితం. అయినా ఎదుగు బొదుగూ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికై కూర్చున్న కుర్చీలో కూర్చున్న తర్వాత, దానికి తిరుమల నుండి తెచ్చిన కండువా దానికి కట్టాక తన దశ తిరిగిందట. అంతే కాదు హైదరాబాద్ నార్సింగ్ లో తాను ఉంటున్న ఇంటికి వెళ్లాక అన్ని శుభాలే జరుగుతున్నాయట. అందుకే తాను కూర్చున్న కుర్చీని వదలడం లేదట నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నూతనంగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా తనకు పెళ్లి చేసిన బ్రాహ్మణుడిని తీసుకువచ్చి ఆయన చేతే పూజలు చేయించి ఆయన చెప్పిన సమయంలోనే ఛార్జ్ తీసుకున్నాడట. ఛార్జ్ తీసుకునేందుకు కాస్త సమయం ఉండడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కూడా వెయిట్ చేయించి మరీ బాధ్యతలు తీసుకున్నాడట.
గతంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కుర్చీ కాకుండా తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాడిన కుర్చీనే తెప్పించుకుని పీసీసీ అధ్యక్షుడి కార్యాలయంలో వేయించుకున్నాడట. నార్సింగ్ లోని ఇంటికి మారిన తర్వాత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిందని, గాంధీభవన్ లో ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత తన దశ తిరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ అంటున్నాడట. దీంతో గాంధీభవన్ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీని గురించే చర్చించుకుంటున్నాయి. ఇక మహేశ్ కుమార్ గౌడ్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యేందుకు పదవులు ఆశిస్తున్న నేతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం.