'టీ' కప్పులో ఉగ్ర తుఫాను.. వందల ప్రాణాలు బలి.. వేల కోట్ల నష్టం
అలాంటి బలూచ్ లో రెండుమూడేళ్లుగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి.. వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ లో బలూచిస్థాన్.. వైశాల్యపంపరంగా పెద్ద రాష్ట్రం.. స్వయం ప్రతిపత్తి కోసం గట్టిగా పోరాడుతోంది.. ఓ రకంగా పాక్ లో ఇది సొంత రాజ్యంగా మారింది. అలాంటి బలూచ్ లో రెండుమూడేళ్లుగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి.. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివెనుక భారత్ వంటి విదేశీ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు చేస్తోంది పాక్. కానీ.. వారి నెత్తిన వారే చేయిపెట్టుకున్న సంగతి ఇప్పుడు బయటపడింది.
అప్పట్లో ఏం జరిగింది..
2021లో అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. దీంతో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ ఆర్మీ జనరల్ హమీద్ అఫ్ఘాన్ వెళ్లి ఛాయ్ తాగారు. ఇదే పెద్ద తప్పైందని పాకిస్థాన్ ఇప్పుడు వాపోతోంది. దేశం మొత్తం మూల్యం చెల్లింస్తోందని ఏడుస్తోంది. తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ లండన్ హైకమిషన్ లో మాట్లాడారు. అఫ్ఘాన్ లో అబ్దుల్ ఘని సారథ్యంలోని ప్రభుత్వానికి అమెరికా మద్దతు ఉండేది. అయితే, అమెరికా సేనలు ఆ దేశం నుంచి వెళ్లిపోయేసరికి తాలిబన్లు పుంజుకొన్నారు. ఘని ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారికి పాక్ మద్దతు ఇచ్చింది. ఇందుకోసం కొందరు ఉగ్రవాదులను విడుదల చేసింది. వీరంతా ఇప్పుడు బలోచిస్థాన్ లో ఉగ్రవాదానికి మాస్టర్ మైండ్లుగా పనిచేస్తున్నట్లుగా దార్ చెప్పారు. అలా.. ఆర్మీ జనరల్ అఫ్ఘాన్ వెళ్లి మద్దతు ఇవ్వడం.. టీ తాగడం దేశం మొత్తాన్ని ముంచేసిందని చెబుతున్నారు. ఇటీవల బలూచిస్థాన్ ఉగ్రవాద 14 మంది సైనికులు సహా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు జరిగిన ఘటనల్లోనూ ప్రాణ నష్టం అధికంగానే ఉంది.
ఇమ్రాన్ ను ఇరికించేలా..
2021లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్నారు. మరి హమీద్ అఫ్ఘాన్ వెళ్లేందుకు ఆయన అనుమతి పొందారా? అంటే దీనికి దార్ అవుననే చెబుతున్నారు. ఇప్పటికే పదవి నుంచి దింపేసి జైలు పాల్జేసిన ఇమ్రాన్ ను మరింత ఇరుకునపెట్టే వ్యూహమే ఇది. ఓ ప్రధాని అనుమతి లేకుండా ఇలాంటి జరగవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఓ కేసులో ఇటీవలే పాక్ సైన్యం ఫయాజ్ హమీద్ ను అరెస్టు చేసి కోర్టు మార్షల్ చేస్తోంది. ఇక బలూచిస్థాన్ వేర్పాటువాదం పీక్ లో ఉంది. తెహ్రీక్ ఈ తాలిబన్, బలూచ్ మిలిటెంట్ సంస్థలు తీవ్ర దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ దెబ్బతో.. దాదాపు 60 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు డేంజర్ లో పడింది.