పోలింగ్ ముంగిట.. మావోయిస్టుల కలకలం.. 25 మంది కిడ్నాప్.. విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముంగిట మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముంగిట మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. అనంతరం.. రెండు గంటల తర్వాత.. వారిని విడిచి పెట్టారు. అయితే.. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని మావోయిస్టులు హెచ్చరించడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది వ్యాపారులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో జరిగే వార సంతకు ఆటోలు, బైక్‌లపై బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులు వాహనాలను అడ్డుకుని వ్యాపారులను కిందికి దింపి, సరకులు, మద్యం సీసాలను విసిరేశారు. వారి సెల్‌ఫోన్లను లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు.
నిత్యావసర సరకులు సరఫరా పేరుతో పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని తమ వ్యాపారం తాము చేసుకుంటున్నామని, తమను వదిలి పెట్టాలని వ్యాపారులు వేడుకున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపుతామని బెదిరిస్తూ వారిని వదిలిపెట్టారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు వాహనాల్లో పోలీసులకు సరకులు తీసుకెళు తుండగా.. మావోయిస్టులను పసిగట్టి వారు తమ వాహనాలను వెనక్కి తిప్పారు.
గమనించిన మావోయిస్టులు వారివెంట పడ్డారు. అయితే సదరు వ్యాపారులు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడటంతో గాయాలపాలయ్యారు. తప్పించుకున్న ఇద్దరు వ్యాపారు లు పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా మారారని, వారు కనిపిస్తే హతమారుస్తామని హుకుం జారీ చేశారు. మరోవైపు.. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.