మోదీని తిట్టారు.. ముప్పు తెచ్చుకున్నారు.. దారికొచ్చిన మాల్దీవ్స్

‘‘భారత్ దళాలు మా దేశంలో ఉండొద్దు’’.. అంటూ బెదిరింపులు.. ‘‘మోదీ ఓ జోకర్’’ అంటూ వెక్కిరింపులు..

Update: 2024-09-11 09:32 GMT

‘‘భారత్ దళాలు మా దేశంలో ఉండొద్దు’’.. అంటూ బెదిరింపులు.. ‘‘మోదీ ఓ జోకర్’’ అంటూ వెక్కిరింపులు.. కానీ, అసలు భారత్ దెబ్బకొడితే ఎలా ఉంటుందో తెలిసింది.. దిమ్మతిరిగి దారికి వచ్చారు. ఇదంతా కేవలం 9 నెలల్లోనే జరిగింది. ఇదంతా మాల్దీవుల గురించి.. ముందుగా పర్యాటకాన్ని టార్గెట్ చేసి.. ఆర్థికంగా దెబ్బతీసిన భారత్.. ఆపై ఆ దేశ అధ్యక్షుడి మెడలు కూడా వంచింది. ఇప్పుడు ఎవరైతే మోదీని తిట్టారో వారి కొలువులూ ఊడాయ్..

మోయిజ్జు.. మహా రచ్చ

మాల్దీవులకు నిరుడు నవంబరులో అధ్యక్షుడు అయ్యారు మొహమ్మద్ మోయిజ్జు. ఆ తర్వాత ఏడు రోజుల్లోనే భారత్ తో విభేదాలకు దిగారు. మాల్దీవుల్లో ఉంటున్న భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని ఆదేశించారు. వారు చెప్పినట్లే చేసింది భారత్. అయితే, వ్యూహాత్మకంగా మోదీ మాల్దీవులకు సమీపంలో ఉండే భారత్ కు చెందిన లక్షద్వీప్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుకుని.. లక్షద్వీప్ ను టూర్ చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా విషయం చేరవేశారు. అసలు సంగతి ఏమంటే.. భారతీయులు మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ ను ఎంచుకోవాలని చెప్పడం. దీనికి భారత్ లోని వివిధ రంగాల ప్రముఖుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. చాలామంది పర్యటకులు మాల్దీవ్ టూర్లు క్యాన్సిల్ చేసుకున్నారు. దీనిపై కడుపు మండిన ముగ్గురు మాల్దీవ్స్ మంత్రులు మోదీని దూషించారు. తాజాగా వీరిలో ఇద్దరు రాజీనామా చేశారు.

మోయిజ్జు వస్తుండగా..

చైనా మాయలో పడి భారత్‌ తో పెట్టుకున్న మోయిజ్జుకు అసలు విషయం అర్థమైంది. ఇప్పుడు మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. త్వరలో ఆయన ఢిల్లీ వస్తున్నారు. ఈ ప్రకటన మంగళవారం బయటకురావడానికి ముందే మాల్దీవ్స్ మంత్రుల రాజీనానామా చోటుచేసుకుంది. వాస్తవానికి మోయిజ్జు.. జూన్ లో జరిగిన మోదీ ప్రమాణస్వీకారానికి వచ్చారు. దీంతో తన ధోరణి మారిందని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల మాల్దీవుల రాజధాని మాలేలో పర్యటించారు. అప్పుడు భారత్‌ అందిస్తున్న అభివృద్ధి సాయానికి మోయిజ్జు ధన్యవాదాలు తెలిపారు.

మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు మల్షా షరీఫ్‌, మారియమ్‌ సిహునా మరో మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడారు. భారత విదేశాంగ శాఖ దీనిని గట్టిగా ఖండించింది. ఈ నేపథ్యంలో మంత్రులను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత మోదీ లక్షద్వీప్ పిలుపుతో మాల్దీవుల పర్యటక రంగం కుదేలైంది. అది ఎంతగా అంటే.. గత ఏడాది ఏప్రిల్‌- జూన్ మధ్య మూడు నెలల్లో 54,207 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లగా.. ఈ ఏడాది ఏప్రిల్ –జూన్ మధ్య అది సగానికి (28,604) పడిపోయింది.

Tags:    

Similar News