యాభై ఏళ్ల ఎమర్జెన్సీ : ఈ రోజు సంగతేంటి ?
దేశంలో అత్యవసర పరిస్థితి అదే ఎమర్జెన్సీ విధించి ఈ రోజుకు అంటే జూన్ 25 కి సరిగ్గా యాభై ఏళ్ళు పూర్తి అయ్యాయి
దేశంలో అత్యవసర పరిస్థితి అదే ఎమర్జెన్సీ విధించి ఈ రోజుకు అంటే జూన్ 25 కి సరిగ్గా యాభై ఏళ్ళు పూర్తి అయ్యాయి. అంటే స్వర్ణోత్సవం అన్న మాట. 1975 జూన్ 25 అర్ధరాత్రి ఈ దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీమతి ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉండగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది రాజ్యాంగ బద్ధమా అంటే దేశంలో అల్లకల్లోలం చెలరేగినపుడు ఎమర్జెన్సీ విధించవచ్చు. భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణం ప్రకారం అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అందుకే ఈ కఠినమైన నిర్ణయం ఇందిరాగాంధీ తీసుకున్నారు. ఇందిరా గాంధీ ఐరన్ లేడీ అన్న మాటకు ఈ దృఢ నిర్ణయం ఒక కచ్చితమైన ఉదాహరణగా చెప్పాలి.
ఆనాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్ధరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధింపజేశారు. అయితే ఏమి జరిగింది, ఎందుకు ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అన్నది కూడా ఒక్కసారి చూడాల్సి ఉంది.
ఇక వెనక్కి వెళ్తే 1971 సార్వత్రిక ఎన్నికల్లో 518 లోక్ సభ స్థానాలకు 352 భారీ ఆధిక్యత సాధించి ఇందిరా గాంధీ తిరుగులేని అధికారంతో రెండోసారి దేశానికి ప్రధాని అయ్యారు. అదే సమయంలో తూర్పు పాకిస్థాన్ విమోచన కోసం పోరాడి పాక్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారు. అలా ఇందిర ఇంటా బయటా అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా అవతరించారు.
భారీ మెజారిటీ వరస విజయాలతో ఇందిరా గాంధీ పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అంతే కాదు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కూడా అణచివేత విధానం అవలంబించారు అన్నది అనాటి చరిత్ర చెబుతోంది. ఈ నేపధ్యంలో ఇందిరా గాంధీ ప్రధాని అయిన రెండేళ్ళ తరువాత అంటే 1973లో విపక్షాలు తమ ఆందోళలను రెట్టింపు చేసాయి. డిసెంబర్ 1973 నుంచి మార్చి 1974 వరకూ గుజరాత్ లో సాగిన నవ నిర్మాణ్ ఉద్యమం వీటన్నిటిలోనూ ప్రసిద్ధి పొందింది.
ఇక 1971లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా ప్రధాని మీద ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దు చేశారు.
ఇది దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇందిర మీద చేసిన ఆరోపణల్లో ఓటర్లకు లంచాలివ్వడం, ఎన్నికల అక్రమాలు వంటి ఆరోపణలు వీగిపోయాయి కానీ ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుగా వినియోగించుకున్న అంశంలో నేరస్తురాలని తేలింది. ఆ తరువాత ప్రతిపక్షాలు మరింతంగా ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనలతో దేశంలోని పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఢిల్లీలో చేసిన ఆందోళనలో పార్లమెంట్ భవనంతో పాటు ప్రధాని నివాసాలకు దగ్గర్లోని రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి.
ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆమె రాజీనామా కోరుతూ విపక్షాలు చేసిన ఆందోళనల్తో దేశం అట్టుడికింది. అయితే ఇందిరా గాంధీ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తన తీర్పుని ప్రకటించింది. అదే సమయంలో ఎంపీగా ఇందిర పొందుతున్న అన్ని సౌకర్యాలను ఆపివేయాలని అలాగే, ఓటింగు నుంచి నిరోధించాలని ఆదేశించింది. కానీ అఇందిరాగాంధీ ప్రధానిగా కొనసాగడానికి అనుమతించింది.
ఇది జరిగిన తరువాత ఇందిరా గాంధీ క్షణం కూడా ఆలోచించకుండా జూన్ 25న అర్ధరాత్రి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే ఇందిరా గాంధీ రెండవ మారు ప్రధాని అయ్యాక ఒక కోటరీని పెట్టుకుని ఏకపక్షంగా పాలన సాగించడం కిచెన్ కేబినెట్ పేరుతో కొంతమంది తోనే ఆమె పాలన సాగించడం వంటివి విపక్షాల ఆందోళన కారణం అయ్యాయి.
ఆ విధంగా చూస్తే కనుక ఇందిరా గాంధీ దేశం అల్లకల్లోలంగా ఉందని భావిస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎమర్జెన్సీ కాస్తా 1977 మార్చి 21 వరకూ అంటే దాదాపుగా రెండేళ్ళ పాటు సాగింది. ఆ సమయంలో దేశంలో పౌర హక్కులకు భంగం వాటిల్లింది. మీడియా స్వేచ్ఛ లేకుండా పోయింది. విపక్షం లేదు. అంతా జైలు పాలు అయ్యారు. ఇలా ఈ దేశంలో ఒక చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ సాగింది.
మొత్తం మీద 1977లో ఎమర్జెన్సీని నిలుపుదల చేశాక జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అయింది. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికి మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ నే ఆదరిస్తూ వచ్చిన దేశ ప్రజలు తొలిసారి ఆ పార్టీని ఓడించారు. ఇందిరాగాంధీకు ఆ చేదు అనుభవం ఎదురైది.
ఇదిలా ఉంటే ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ చీకటి అధ్యాయం ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. దీని మీద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే నాటి ఎమర్జెన్సీ ప్రకటితమని పదేళ్ళుగా మోడీ పాలన్లో అప్రకటిత ఎమర్జెన్సీ సాగుతోందని సెటైర్లు వేశారు.
ఏది ఏమైనా స్వేచ్చా స్వాతంత్రాల కోసం రెండు వందల ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రం ఇది. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేలా పాలన సాగాలి తప్ప హక్కులు హరించేలా ఉండకూడదు అన్నది మేధావుల ప్రజాస్వామ్య ప్రియుల మాట.