మోడీకి పూజలు చేస్తా: ఫైర్‌బ్రాండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
విరుచుకుపడే ఆమె తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీకి గుడి కట్టిస్తానని.. అది కూడా తన సొమ్ముతోనే కట్టిస్తానని.. ఆయనకు పూజలు కూడా చేస్తానని వ్యాఖ్యానించారు.
ఫైర్ బ్రాండ్ నాయకులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో సై అంటే సై అంటూ.. విరుచుకుపడే ఆమె తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీకి గుడి కట్టిస్తానని.. అది కూడా తన సొమ్ముతోనే కట్టిస్తానని.. ఆయనకు పూజలు కూడా చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ ప్రసాదాలు కూడా పెడతానని అన్నారు. దేవుడే తనను భారత దేశం కోసం పంపించాడన్న మోడీ వ్యాఖ్యలను ఆమె తూర్పార బట్టారు. ''మోడీని దేవుడు పంపించాడట. ఆయనకు జీవసంబంధం(తల్లిదండ్రులు) లేదట. ఇలాంటి మోడీకి మనమంతా గుడి కట్టి పూజించాలి'' అని వ్యంగ్యాస్త్రలు సంధించారు.
ఇదేసమయంలో ప్రధాని మోడీపై మమత తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ''అల్లర్లు ప్రేరేపిస్తున్నారు. ఇవి దేవుడు పంపించి న దైవాంశ సంభూతులు చేయాల్సిన పనేనా? మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు.. ఇది దేవుడు పంపించిన దైవాంశ సంభూ తుడు చేయాల్సిన పనేనా..? ఎవరూఏ దేవుడూ కూడా.. రాజకీయాల్లో అల్లర్లను ప్రేరేపించి.. ఇళ్లు తగలబడుతుంటే.. ఒక రాష్ట్రం తగలబడుతుంటే.. చలికాచుకోరు. కానీ, తనను తాను దైవాంశం సంభూతుడినని చెప్పుకొంటున్న మోడీ మాత్రమే ఈ పనిచేయగలరు. అందుకే మనం ఆయనకు గుడి కట్టాలి'' అని మమత నిప్పులు చెరిగారు.
ఈ దేశంలో అనేక మంది ప్రధానులు పనిచేశారని.. వీరిలో ఎంతో మంది తమ కుటుంబాలను వదులుకుని కూడా సేవ చేశారని చెప్పారు. కానీ, మోడీ మత కల్లోలాలు రెచ్చగొడుతూ.. మతాల మధ్య చిచ్చు పెడుతూ.. తనను తాను దైవాంశం సంభూతుడి నని.. దేవుడు పంపించాడని చెప్పుకోవడం.. ఈ దేశం సిగ్గు పడాల్సిన విషయమని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''ఈ దేశం ఇప్పటికి అనేక మంది ప్రధానులను చూసింది. కానీ, మోడీ వంటి మత చిచ్చు పెట్టే నాయకుడు ఎవరూ లేరు'' అని మమత దుయ్యబట్టారు.
''మోడీని దేవుడని.. బీజేపీ నాయకులు అంటున్నారు. ఒకాయన ఏకంగా.. పూరి జగన్నాథుడే మోడీకి భక్తుడని వ్యాఖ్యానించారు. సరే.. ఇలాగే భజన చేయాలంటే నాకు అభ్యంతరం లేదు. కానీ, నేను మోడీకి గుడి కడతా. ప్రసాదంగా గుజరాత్ ప్రత్యేక వంటకం డోక్లా పెడతా. అయితే... మోడీ గారు చేయాల్సింది.. ఆ గుడిలో కూర్చోవడమే. మేమే నిత్యం ఆయనకు హారతులు ఇస్తాం. టెంకాయలు కొడతాం. రోజూ పూజలు చేస్తాం'' అని మమత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఓ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు మోడీ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.