ఇండియాలో సెగలు.. మమత హాట్ కామెంట్స్
కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బలమైన ప్రధాని నరేంద్ర మోడీని అంతే బలంగా ఢీ కొట్టేందుకు.. ప్రాంతీయ పార్టీల దన్నుతో ముందుకు సాగి.. విజయం దక్కించుకుని కేంద్రం లో పాగా వేయాలని నిర్ణయించుకుంది. అయితే.. కాంగ్రెస్‌వ్యూహం బాగానే ఉన్నా.. ఆ పార్టీ అనుసరిస్తు న్న విధానాలు.. చిన్న చిన్న పొరపాటు పెద్ద చిచ్చునే రాజేస్తున్నాయి.
కొన్నాళ్ల కిందట ఇండియా కూటమి కన్వీనర్ విషయంలో కూటమి పార్టీ నేత, బిహార్ సీఎం నితీష్‌కుమార్ విభేదించారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అతి కష్టం మీద ఆయనను బుజ్జగించాల్సి వచ్చింది. మొత్తానికి కన్వీనర్‌గా ప్రస్తుత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకే పగ్గాలు అప్పగించారు. ఇక, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. పశ్చిమ బెంగాల్‌సీఎం మమతా బెనర్జీ మరో కుంపటి పెట్టారు. తాజాగా ఆమె ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు.
''రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తున్నాడట. మా రాష్ట్రానికి పక్కనే ఉన్న మణిపూర్‌లో ప్రారంభించాడట. కానీ, మాకు మాట మాత్రమైనా చెప్పులేదు. ఎక్కడో ఉన్నవారిని ఆహ్వానించారు. ఏం మేం యాత్రకు పనికి రాలేదా? లేక మాకు చెప్పకూడదని అనుకున్నారా? కానీ, మేం వారికి అవసరం. ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి'' అని మమత వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సీట్ల షేరింగ్ పైనా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో లోక్‌సభ సీట్ల పంపిణీ విషయంపై తామే నిర్ణయం తీసుకుంటామన్నారు.
''సీట్ల కేటాయింపు అంశం మా వ్యక్తిగతం. వేరే పార్టీ వారు మాకు ఆఫర్ ఇవ్వడం ఎందుకు? మాతో చర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం'' అని తెగేసి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 47 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌భావిస్తోంది. కానీ, మమత మాత్రం రెండు కన్నా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం రగులుతూనే ఉంది. ఇప్పుడు ఈ వివాదంమరింత పెరిగింది.