బుజ్జగింపులకు నో ఛాన్స్... మంగళగిరి వైసీపీకి కొత్త ఇన్ ఛార్జ్!
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇదే సమయంలో తన ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఆర్కేని బుజ్జగించే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
అవును... వ్యక్తిగత కారణాలతోనే తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆర్కే స్పష్టతనిచ్చిన అనంతరం మంగళగిరిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఆర్కేని బుజ్జగించే కార్యక్రమాలు లేవని తెలుస్తుంది. ప్రధానంగా మంత్రి పదవి దక్కలేదని ఆయన అసంతృప్తితో ఉండగా.. మరోపక్క రాబోయే ఎన్నికల్లో మంగలగిరి టిక్కెట్ బీసీలకు ఇస్తారని ప్రచారం జరుగుతుండటం కూడా ఒక కారణం అని తెలుస్తుంది.
ఈ సమయంలో మంగళగిరి వైసీపీకి ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని నియమించబోతున్నారని తెలుస్తుంది. ఈరోజే వైఎస్ జగన్.. గంజి చిరంజీవితో భేటీ అయ్యారు. అనంతరం ఆయనను ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. ఈసారి కూడా మంగళగిరిలో చినబాబుని మట్టికరిపించాలని భావిస్తున్న వైసీపీ... చేనేతలు ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో పద్మశాలీలకు ఈసారి టిక్కెట్ ఇవ్వాలని భావిస్తుందని తెలుస్తుంది.
అయితే ఈ మేరకు గతంలోనే జగన్.. గంజి చిరంజీవికి మంగళగిరి ఎమ్మెల్యే టిక్కెట్ పై హామీ ఇచ్చారని అంటున్నారు. దీనికి సంబంధించి ఆర్కేకు పక్కా సమాచారం ఉండటంతోనే రాజీనామా చేశారని తెలుస్తుంది. మరోపక్క వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రాజీనామా అనంతరం ఆయనతో మాట్లాడాలని పార్టీ అధిష్టాణం ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆయన అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. అనుచరులు మాత్రం ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారని చెబుతున్నారు. దీంతో బుజ్జగింపులకు ఆయన అవకాశం ఇచ్చేలా లేరని అంటున్నారు పరిశీలకులు. ఇదేదో బెదిరింపు చర్య కాదని.. ఆయన పూర్తిగా ఫిక్సయినట్లున్నారని చెబుతున్నారు.
కాగా.. వైసీపీలో ఆర్కే కీలకమైన నేతగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడిగానే నడుచుకున్నారు! టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతికి సంబంధించి వేసిన కేసులను ఆల్ మోస్ట్ ఆయనే డీల్ చేశారు. అలాంటి కీలక నేతను పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. దీంతో ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తుందని.. అయితే ఆర్కే మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు.