"బీఆరెస్స్ వారియర్స్ యూరిన్ శాంపుల్స్ కాంగ్రెస్ ఎంపీ ఇంటికి పంపండి"!
అవును... బీఆరెస్స్ నాయకులు, కార్యకర్తలకు డ్రగ్స్ పరీక్షలు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన మన్నె క్రిశాంక్
బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది (ఫామ్)హౌస్ పై పోలీసులు దాడి చేయడం, అక్కడ విదేశీ లిక్కర్ ఉందని, డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగాలు, ఆరోపణలు తెరపైకి రావడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆరెస్స్ – కాంగ్రెస్ నేతల మద్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇందులో భాగంగా... కేటీఆర్ బావమరిది కోసం పోరాడుతున్న బీఆరెస్స్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... డ్రగ్స్ తో పట్టుబడిన వారిని సమర్ధిస్తున్న బీఆరెస్స్ నాయకులకు కూడా డ్రగ్స్ టెస్ట్స్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తుంటే.. బీఆరెస్స్ నేతలు మాత్రం డ్రగ్స్ ని ప్రోత్సహించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు! ఈ నేపథ్యంలో బీఆరెస్స్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ సోషల్ మీడియా జనాలకు ఓ ఆసక్తికరమైన సూచన చేశారు!
అవును... బీఆరెస్స్ నాయకులు, కార్యకర్తలకు డ్రగ్స్ పరీక్షలు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన మన్నె క్రిశాంక్... "ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంపీ గారూ" అని మొదలుపెట్టి... "బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ అంతా యూరిన్ శాంపిల్స్ ని ఎంపీ నివాసానికి పంపాలని కోరుతున్నా.. తద్వారా వారు పరీక్షలు నిర్వహిస్తారు" అని అన్నారు.
కాగా... జన్వాడలోని కేటీఆర్ బావమరిది (ఫామ్)హౌస్ పై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి హాజరైన వారిలో ఒకరికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలీందని.. ఆ పార్టీలో అనధికారిక మద్యం కూడా వాడుతున్నట్లు గుర్తించారని.. దీంతో.. ఎన్.డీ.పీ.ఎస్., ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారని అంటున్నారు!
అయితే... తన బావమరిదిపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ తోసి పుచ్చారు. అది ఫ్యామిలీ పార్టీ అని.. అందులో భార్యభర్తలు, పిల్లలు, వృద్ధులు కూడా పాల్గొన్నారని.. అక్కడ ఒకరిద్దరు మద్యం తాగితే తాగి ఉండోచ్చని.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, అవినీతిని బయటపెడుతుండటంతోనె తమ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు!