పతకాన్ని సాధించిన మనుబాకర్ శిక్షణకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందంటే?

నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడల సందర్భంగా భారత్ అథ్లెట్ల ప్రతిభను.. పతకాలు సాధించిన అంశంపై చర్చ జరుగుతూ ఉంటుంది.

Update: 2024-07-30 05:01 GMT

నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడల సందర్భంగా భారత్ అథ్లెట్ల ప్రతిభను.. పతకాలు సాధించిన అంశంపై చర్చ జరుగుతూ ఉంటుంది. పోటీలు చివరకు వచ్చేస్తున్నా.. పతకాలు సాధించని వైనంపై కోట్లాది మంది భారతీయులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయటం.. ఈ సందర్భంగా ప్రభుత్వాలు క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యతపై చర్చ జరగటం తెలిసిందే. తాజాగా పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో కాస్త భిన్నమైన సీన్ కనిపించింది.

పోటీలు ప్రారంభమైన మొదట్లోనే భారత్ కు తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించటం భారతీయులంతా ఆనందంతో ఉబ్బితబ్బుబ్బిపోయేలా చేసింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకాన్ని సాధించిన షూటర్ గా మను బాకర్ నిలిచారు. 22 ఏళ్ల మనుబాకర్ స్ఫూర్తిదాయ ప్రదర్శనకు దేశ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది.

ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. రజత పతకం కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. క్వాలిఫికేషన్ లో 580 స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచిన ఆమె.. ఫైనల్లో అదిరే ప్రదర్శన చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో విజయకుమార్, గగన్ నారంగ్ పతకం తర్వాత ఒక భారతీయ షూటర్ ఒలింపిక్ పతకాన్ని సాధించటం ఇదే. గతంలో పతకాలు సాధించిన ఇద్దరు షూటర్లు రజతం.. కాంస్య పతకాల్ని గెలుచుకున్నారు.

పారిస్ ఒలింపిక్స్ లో తొలి పతకాన్ని భారత్ కు అందించి మనుబాకర్ దేశం గర్వపడేలా చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రి మనుసుఖ్ మాండవీయ ప్రస్తావిస్తూ.. ఆమెకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. ఈ పతకాన్ని సాధించేందుకు మనుబాకర్ పడిన కష్టాన్ని.. తీసుకున్న కఠిన శిక్షణ గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఆమె ఖేలో ఇండియాలో భాగమన్న ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఒలింపిక్ పతకం సాధించిన షూటర్ కు దన్నుగా ప్రధాని మోడీ నిలిచారన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు.

ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో క్రీడలకు మౌలిక సదుపాయాల కల్పన పెరిగిందని.. స్కూళ్లు.. కాలేజీల స్థాయిలోనే క్రీడా నైపుణ్యాల్ని గుర్తించి తగిన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టాప్స్ పథకం కింద ఆటగాళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేశారన్నారు. ఇక.. మనుబాకర్ మీద ఎంత ఖర్చు చేశామన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘‘మనూ బాకర్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం దాదాపు రూ2కోట్లు ఖర్చు చేసింది. శిక్షణ కోసం జర్మనీ..స్విట్జర్లాండ్ పంపాం. ఆమెకు కావాల్సిన కోచ్ ను నియమించుకోవటానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాం. జాతీయ.. అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు ఇదే విధంగా తోడ్పాటును అందిస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో ఇతర భారత క్రీడాకారులు గొప్పగా రాణిస్తారు’’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News