ఆత్మాభిమానం చంపుకోలేక 65 ఏళ్ల వయసులో 600 కి.మీ. నడక!
అవును... పలు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఏడాది పాటు పని దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతుకుంటుంటారనే సంగతి తెలిసిందే
ఇటీవల కాలంలో రోడ్లపైకి వెళ్తే వయసుతో సంబంధం లేకుండా.. వయసులో ఉండి, ఫిట్ గా ఉన్నవాళ్లు సైతం చాలా మంది బిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు! అయితే.. 65 ఏళ్ల వయసులో రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి.. అక్కడ పని దొరక్కపోవడంతో ఎవరినీ చెయ్యి చాచి డబ్బులు అడగలేక, సుమారు 14 రోజులపాటు కాలినడకన 600 కి.మీ. అవతల ఉన్న స్వగ్రామానికి చేరుకున్న ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి సంగతే ఈ కథనం!
అవును... పలు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఏడాది పాటు పని దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది ఫ్యామిలీతోపాటు వయస వెళ్తుంటే.. ఇంకొంతమంది మాత్రం కుటుంబాన్ని గ్రామాల్లోనే ఉంచి, వారు మాత్రం వలస వెళ్తుంటారు. ఈ సమయంలో... సోను బొత్ర అనే వ్యక్తి 60ఏళ్లు పైబడిన తర్వాత దళారి మాటలు విని హైదరాబాద్ కి వచ్చారు.
ఒడిషా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లా కొసగుముడా సమితి డుమరబెడ గ్రామానికి చెందిన సోను బొత్ర (65) కు కొడుకు, ఫ్యామిలీ ఉన్నప్పటికీ తాను ఈ వయసులో కూడా ఏదైనా పనిచేయాలని, ఎవరికీ భారం కాకూడదన్నట్లుగా నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ సమయంలో ఓ దళారి సాయంతో సుమారు 17 రోజుల క్రితం కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇటుక బట్టీ దగ్గరకు వెళ్లాడు.
ఈ సమయంలో ఆ బట్టీ యజమాని బొత్రను చూసి.. వయసు ఎక్కువగా ఉందని, పనిలో పెట్టుకోవడం కుదరదని చెప్పాడు. అయినప్పటికీ ఎలాంటి పని ఇచ్చినా చేస్తానంటూ బొత్ర.. సదరు ఇటుక బట్టీ యజమానికి బ్రతిమాలుకున్నాడు. అయినప్పటికీ అంగీకరించని యజమాని.. చివరకు రూ.200 ఇచ్చి బొత్రను ఊరికి వెళ్లిపోమని చెప్పారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన సోను బొత్ర.. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అయితే అందుకు ఆ ఇటుక బట్టీ యజమాని ఇచ్చిన రూ.200 సరిపడని పరిస్థితి! ఈ సమయంలో... ఎవరినీ చేయి చాచి అడగలేక, సుమారు 14 రోజుల క్రితం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం కాలినడకన మొదలుపెట్టాడు సోను బొత్ర. ఈ సమయంలో ఓపిక ఉన్నంత సేపు నడవడం.. మార్గ మద్యలో ఎవరైనా భోజనం పెడితే తినడం.. అలసిపోయిన చోట కాసేపు విశ్రాంతి తీసుకోవడం చేస్తూ... సుమారు 600 కి.మీ. నడిచాడు.
ఆఖరికి సోమవారం (జూలై 29)న మాలిగూడ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడకు చేరుకునే సరికి పూర్తిగా నీరసించిపోయాడు. ఈ సమయంలో బొత్రను చూసిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో... హుటాహుటిన అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి ఆటోలో తీసుకెళ్లారు. పని ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి మోసం చేసిన దళారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు!