వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి కీలక నేత!
ఏపీలో ప్రతిపక్ష పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి.. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి నేతల వలసలు పెరిగిపోతున్నాయి.
ఏపీలో ప్రతిపక్ష పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి.. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి నేతల వలసలు పెరిగిపోతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ తో ఉన్న నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో పక్క చూపులు చూస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే భవిష్యత్ లేదనుకుంటున్నారో.. తమకు అవకాశం లేదని భావిస్తున్నారో కానీ అధినేతకు అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు కూడా జంపింగులకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు.
ఇప్పటికే కీలక నేతలు ఎంతో మంది నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అలా చేరిన వారు తమ సహచరులు మరికొందరిని తమతో వచ్చేయమని కబురు పంపుతున్నారు. ఇక గతంలో వైసీపీకి గట్టి పట్టున్న గుంటూరు వంటి జిల్లాల్లో ప్రస్తుతం నేతలు వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ సిట్టింగ్ ఎంపీ వైసీపీని వీడగా, తాజాగా చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి టాటా చెప్పేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
పార్టీ అధికారం కోల్పోయిన నుంచి వలస వెళ్లే నేతల్లో మర్రి రాజశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే అధినేత జగన్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇంతకాలం వాయిదా పడుతూ వస్తోందంటున్నారు. అయితే ఇటీవల పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గడం, ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని తిరిగి యాక్టివ్ అవ్వడంతో ఇక తాను వైసీపీలో ఉండి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇటీవల వైసీపీ అధినేత జగన్ సమక్షంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నేతల సమీక్ష సమావేశానికి మర్రి డుమ్మా కొట్టారు. ఆయన స్థానికంగా అందుబాటులో ఉన్నా, తాడేపల్లి వైపు వచ్చేందుకు ఆసక్తి చూపలేదంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. భవిష్యత్ లో కూడా వైసీపీలో ఉంటే ఆ చాన్స్ వచ్చే పరిస్థితి లేదని ఆయన అనుమానిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన మర్రి రాజశేఖర్.. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ పోటీ చేద్దామనుకుంటే ఆఖరి క్షణంలో పార్టీలో చేరిన విడదల రజిని ఆయన టికెట్ ను తన్నుకుపోయారు. 2024లో చాన్స్ వస్తుందని ఆశించారు. కానీ ఆ ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న రజినిని గుంటూరు వెస్ట్ కు మార్చారు. ఆమె స్థానంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడికి చాన్స్ ఇచ్చారు.
ఇక ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన వైసీపీ ప్రత్యామ్నాయంగా మర్రికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం వల్ల ఆయన ఆ పదవిని ఇష్టపడటం లేదని చెబుతున్నారు. 2029లో అయినా పార్టీ తరఫున అవకాశం వస్తుందని ఇన్నాళ్లు ఆయన ఆశించారు. అయితే గుంటూరు వెస్ట్ లో ఓడిన మాజీ మంత్రి విడదల రజినీని మళ్లీ చిలకలూరిపేటకు మార్చారు. దీంతో తనకు ఎదురుచూపులు తప్ప.. అవకాశం రాదని భావించిన ఆయన పార్టీ మారడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
నరసారావుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయులు ద్వారా మర్రి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ పెద్దలతో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలా? లేక ఎమ్మెల్సీగానే కొనసాగాలా? అనే విసయమై ప్రస్తుతం ఆయన తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న ప్రభుత్వానికి మండలిలో బలం లేదు. మండలిలో మెజార్టీ రావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సివస్తోంది. దీంతో కీలక బిల్లులు ఆమోదం విషయంలో ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు రాజీనామా చేసినా గెలిపించుకునే పరిస్థితి ఉన్నందున నైతిక విలువలు పాటించామని చెప్పుకునేందుకు రాజీనామాలు చేయించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీరిని ఇంకా పార్టీలో చేర్చుకోలేదు. ఈ నేపథ్యంలో మర్రికి లైన్ క్లియర్ గా ఉన్నందున ఆయన విషయంలో టీడీపీ అధిష్ఠానం ఆలోచన ఎలా ఉందన్నది తెలియడం లేదు. మొత్తానికి మర్రి చేరిక లాంఛనమే అనే ప్రచారం జరుగుతోంది.