మల్లారెడ్డి అల్లుడికి బంఫర్‌ చాన్స్‌!

కాగా వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంపైన రాజశేఖర్‌ రెడ్డి కన్నేశారని టాక్‌ నడుస్తోంది

Update: 2023-08-24 06:34 GMT

'పూలు అమ్మినా.. పాలు అమ్మినా.. కాలేజీలు పెట్టినా' అంటూ తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి తన డైలాగులతో బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా, మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డికి వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే సీటు ఖరారైంది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో మల్లారెడ్డి సీటు దక్కించుకున్నారు.

కాగా మల్లారెడ్డి అల్లుడు, మర్రి లక్షా్మరెడ్డి విద్యా సంస్థల అధినేత మర్రి రాజశేఖర్‌ రెడ్డి 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 10,919 ఓట్ల తేడాతో రేవంత్‌ రెడ్డి గెలుపొందారు.

ప్రస్తుతం రాజశేఖర్‌ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. అంతేకాకుండా కంటోన్నెంట్‌ లో ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో అక్కడి బాధ్యతలను కూడా రాజశేఖర్‌ రెడ్డే చూస్తున్నారు.

కాగా వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంపైన రాజశేఖర్‌ రెడ్డి కన్నేశారని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు తాజాగా కే సీఆర్‌ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించినా ఇందులో మార్పు చేస్తారని.. మైనంపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో మైనంపల్లిపై వేటుతో ఖాళీ అయ్యే మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్‌ రెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి సైతం తన అల్లుడు రాజశేఖర్‌ కు సీటు ఇవ్వాలని కేసీఆర్‌ ను కోరినట్టు చెబుతున్నారు. ఆర్థికంగా బలవంతుడైన మైనంపల్లిని ఎదుర్కోవాలంటే అంతే బలమున్న తన అల్లుడు రాజశేఖర్‌ వల్లే అవుతుందని మైనంపల్లి.. కేసీఆర్‌ కు చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే కేసీఆర్‌ ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి రాజశేఖర్‌ రెడ్డిని దింపాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అందులోనే కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున గట్టి అభ్యర్థులు ఉండాలని ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ రెడ్డిని పార్లమెంటుకు పోటీ చేయించి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆల్వాల్‌ కార్పొరేటర్‌ గా ఉన్న విజయశాంతి రెడ్డిని బరిలోకి దింపుతారని చెబుతున్నారు. అలాగే ఈమెతోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మోతె శోభన్‌ రెడ్డి, తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News