వైసీపీ తెచ్చిన మరో కీలక పథకం రద్దు!
అయితే అన్ని సేవలు ఇంటికే అనే రీతిలో వైసీపీ ప్రభుత్వం రేషన్ ను కూడా ఇంటింటికి అందజేయడంపై దృష్టిపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రజలు రేషన్ కోసం చౌకడిపో దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేవారు. అయితే అన్ని సేవలు ఇంటికే అనే రీతిలో వైసీపీ ప్రభుత్వం రేషన్ ను కూడా ఇంటింటికి అందజేయడంపై దృష్టిపెట్టింది.
ఇందులో భాగంగా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు (ఎండీయూ)లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో ఎండీయూ వాహన డ్రైవర్, సంబంధిత రేషన్ డీలర్ ఆ వాహనంలో రేషన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్ అందజేసేవారు.
ఈ విధానంపైన రేషన్ డీలర్లు, ప్రజల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నెలలో ఒక్కసారి రేషన్ దుకాణాలకు వెళ్లి తెచ్చుకోలేనంత బిజీగా ప్రజలు ఉన్నారా అనే ప్రశ్నలు ఉదయించాయి. అలాగే ఆ ఎండీయూ వాహనాలు కూడా వైసీపీ కార్యకర్తలకే దక్కాయనే ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే, ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎండీయూ వాహనాలు, ఇంటింటికీ రేషన్ పంపిణీపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులతో వీటిపైన తాజాగా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేదని.. నష్టాలే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల నష్టం జరుగుతోందని వెల్లడించారు.
ఇంటింటికీ బియ్యం పంపిణీ చేయకుండా వీధి చివర వాహనాలను నిలిపి ఉంచుతున్నారని చెప్పారు. లబ్ధిదారులు అక్కడికి వచ్చి రేషన్ బియ్యం తీసుకుంటున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం రూ. 9,260 వాహనాలు కొనుగోలు చేసిందని నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ డోర్ టు డోర్ రేషన్ బియ్యం పంపిణీ పథకం కింద 1,844 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.
ఈ వాహనాలను వైసీపీ నేతలు రాష్ట్రం నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఏ విధంగా దుర్వినియోగం చేశారో సీఎంకు మంత్రి మనోహర్ వివరించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.